Begin typing your search above and press return to search.

తెలుగు తెరపై విరిసిన తెల్ల మందారం .. తాప్సీ

By:  Tupaki Desk   |   1 Aug 2021 3:43 AM GMT
తెలుగు తెరపై విరిసిన తెల్ల మందారం .. తాప్సీ
X
తెలుగు తెరపై తెల్ల మందారం తాప్సీ .. వెండితెరపై వెన్నముద్ద తాప్సీ. తెరపై ఆమె కనిపిస్తే తెల్లని మేఘం తేలుతున్నట్టుగా ఉంటుంది. మంచి గంధం అద్దిన మంచు శిల్పంలా ఉంటుంది. అలాంటి తాప్సీ 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తెరపై ఆమెను చూసినవాళ్లు సౌందర్యపు జలపాతం అనుకున్నారు .. పరవళ్లు తొక్కే సొగసుల ప్రవాహం అనుకున్నారు. అప్పటివరకూ గుండె గోడలకు ఎవరెవరివో పోస్టర్ లను అంటించుకున్న కుర్రాళ్లు, గబగబా తుడిచేసి ఆమె బొమ్మను గీసేసుకున్నారు.

అభినయం సంగతి అటుంచితే అందమే ఆరంభంలో తాప్సీకి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె నటిస్తానని చెప్పినా, ఆమెకు ఆ తరహా పాత్రలు రాలేదు. తెరపై ఆమె కనిపిస్తే చాలు .. ఆమె గ్లామర్ తళతళలు మురిపిస్తే చాలు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అందువలన తాప్సీ వరుసగా ఆ తరహా పాత్రలను పోషిస్తూ వచ్చింది. అలా వరుసగా ఆమెకు ఆ పాత్రలను ఇస్తూ వెళ్లినవారే, చివరికి ఆమెకి అభినయం పెద్దగా తెలియదని తేల్చేశారు. ఈ లోగా పరాజయాలు కూడా ఆమెతో సహవాసం చేయడం మొదలుపెట్టాయి.

తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండటంతో, సహజంగానే తాప్సీ తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ కుదురుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉందనిపించడంతో ముంబైకి మకాం మార్చేసింది. ఇక కష్టమైనా అక్కడే తన కెరియర్ ను కొనసాగించాలని పట్టుదలతో ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ తనకి కావలసినంత గ్లామర్ ఉంది. అందువలన నటన ప్రధానమైన పాత్రలనే ఎంచుకోవాలనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసింది. అలా ఆమె నటన ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లింది.

అలా నిదానంగా తాప్సీ వేసిన అడుగులు .. పరుగుల మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంది. ఆ సినిమాలన్నీ కూడా తాప్సీకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. తాప్సీ లో అంత గొప్పనటి ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేయగలిగింది. బాలీవుడ్లో అమితాబ్ మొదలు చాలామంది సీనియర్ స్టార్ల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. ఫలానా తరహా పాత్రలను తాప్సీ అయితేనే బాగా చేయగలదనే పేరు తెచ్చుకుంది. పాత్రల విషయంలో ఆమె చేసే కసరత్తును గుర్తించినవారు అవకాశాలనిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు .. తమిళ భాషల నుంచి తాప్సీ కి అవకాశాలు వెళ్లడం మొదలయ్యాయి. దాంతో ఆమె ఒక వైపున హిందీ సినిమాలు చేస్తూనే, మరో వైపున తెలుగు .. తమిళ సినిమాలు కూడా చేస్తూ వెళుతోంది. తెలుగులో ప్రస్తుతం ఆమె 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాను చేస్తోంది. ఇక తమిళ .. హిందీ భాషల్లో కలుపుకుని ఆమె చేతిలో మరో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు తప్పకుండా ఆమెను మరోస్థాయికి తీసుకెళతాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన తాప్సీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.