Begin typing your search above and press return to search.

డిసెంబర్ లో సెట్స్ మీదకు తారక్ కొత్త సినిమా..?

By:  Tupaki Desk   |   27 Oct 2021 10:32 AM GMT
డిసెంబర్ లో సెట్స్ మీదకు తారక్ కొత్త సినిమా..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తారక్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఇదే క్రమంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ని కూడా ముగించారు. ఇటీవలే ఈ షో చివరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో కొరటాల శివ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

NTR30 షూటింగ్ స్టార్ట్ కావడానికి దాదాపు నెలన్నర సమయం ఉంది. అందుకే తారక్ సుదీర్ఘ విరామం తీసుకొని హాలిడేకి వెళ్లనునట్లు టాక్ నడుస్తోంది. చివరగా 2018 లో 'అరవింద సమేత' సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించిన ఎన్టీఆర్.. అప్పటి నుంచి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. వెంటనే 'ఎవరు మీలో ఎవరు కోటీశ్వరులు' గేమ్ షో కి డేట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తన చేతిలో తగినంత సమయం ఉన్నందున.. తారక్ తన భార్యా పిల్లలతో కొంత ఫ్యామిలీ టైమ్ గడపాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

కాగా, 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కొరటాల శైలిలో సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ప్రస్తుతం #NTR30 కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు - సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని సంప్రదించారని తెలుస్తోంది. అలానే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ - ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈజిప్టు లో 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. సినిమాలోని మేజర్ షూటింగ్ ఇక్కడే చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని వీలైనన్ని తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. నందమూరి కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.