Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కి పోటీగా నేను ఎంట్రీ ఇవ్వలేదు: తారకరత్న

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:30 PM GMT
ఎన్టీఆర్ కి పోటీగా నేను ఎంట్రీ ఇవ్వలేదు: తారకరత్న
X
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తారకరత్న ఒకరు. 2002 లోనే హీరోగా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యాడు. 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆయన కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన విలన్ వేషాల వైపు కూడా వెళ్లాడు. 'అమరావతి' సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన ఆయన, ఆ తరువాత అదే తరహా పాత్రలతో ముందుకు వెళతాడని అంతా అనుకుంటే అలా కూడా జరగలేదు.

కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, తన కెరియర్ ను గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నందమూరి ఫ్యామిలీ నన్ను దూరం పెట్టిందని అంతా అనుకుంటున్నారు .. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నన్ను మొదటి నుంచి ఎలా చూసుకుంటున్నారో .. ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నారు. ఎవరో ఏదో రాశారని చెప్పేసి ప్రతి విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయమంతే. మా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు.

ఎందుకంటే మా తాతగారు మాకు నేర్పించిన విలువలు వేరు .. మా మధ్య ఉండే అనుబంధాలు వేరు .. ఆప్యాయతలు వేరు. మా తాతగారు మాకు వందల కోట్ల ఆస్తులను ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఆ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. ఇన్ని కోట్లమంది ప్రజల అభిమానం మాకు దక్కేలా ఆయన చేశారు. అంతకంటే ఎక్కువ మాకు కావలసినదేవుంటుంది? ఇక ఎన్టీఆర్ కి పోటీగా నన్ను లాంచ్ చేశారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఇప్పటికీ అది వినిపిస్తూనే ఉంటుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు.

నేను ఇండస్ట్రీకి రావాలి .. హీరోను కావాలి అనేది నా కల. అందుకు నా కుటుంబ సభ్యులంతా సపోర్టు చేశారుగానీ, ఎన్టీఆర్ కి పోటీ అని ఎవరూ అనుకోలేదు. బయట జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. మా ఫ్యామిలీలో నా కంటే ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడనే ఫీలింగ్ ఎప్పుడూ లేదు. తను ముందుకు వెళ్లినా ఎన్టీఆర్ ఫ్యామిలీని ముందుకు తీసుకుని వెళుతున్నట్టే గదా.

ఆయనకి నేను పోటీ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను .. ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ మేమంతా ఎక్కడ కలుసుకున్నప్పటికీ చాలా సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి సక్సెస్ ను మరొకరం ఎంజాయ్ చేస్తూనే ఉంటాము" అని చెప్పుకొచ్చాడు.