Begin typing your search above and press return to search.

భరత్ అనే నేను.. టీడీపీకి కష్టమే

By:  Tupaki Desk   |   24 March 2018 11:29 AM GMT
భరత్ అనే నేను.. టీడీపీకి కష్టమే
X
పెద్ద హీరోలు పొలిటికల్ సినిమాలు చేస్తున్నారంటే రాజకీయ పార్టీల్లో కొంచెం ఆందోళన నెలకొనడం సహజం. వర్తమాన రాజకీయాలపై సినిమాలు తీస్తూ అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ మీదో.. లేదా ఇంకో పార్టీకి తగిలేలాగో పరోక్షంగా సెటైర్లు గుప్పించడం మామూలే. నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలు చాలా వాటిలో పొలిటికల్ డైలాగులున్నాయి. ఆయన ప్రత్యర్థి పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటాడు. ఐతే ఇప్పుడు ఓ సినిమా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో కొంచెం గుబులు రేపుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’.

మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చాలా వరకు సమకాలీన రాజకీయాల నేపథ్యంలోనే సాగనుంది. ప్రజా సమస్యలపై లోతైన చర్చ ఉంటుందట. మామూలుగానే కొరటాల శివ సామాజికాంశాల మీదే సినిమాలు తీస్తుంటాడు. ప్రతి సినిమాతోనూ ఎంతో కొంత మంచి చెప్పాలని చూస్తుంటాడు. ‘భరత్ అనే నేను’లో మంచి చెప్పడంతో పాటు జరుగుతున్న చెడు మీద కూడా గట్టిగానే చర్చించనున్నారట. అవినీతి మీద ఇందులో పెద్ద డిస్కషనే ఉంటుందట. అలాగే నిరుద్యోగిత.. ఆసుపత్రుల్లో అరాచకాలు.. రాజకీయ నాయకులు చేసే అన్యాయాల మీద చర్చిస్తారట. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే సినిమా. తెలంగాణ.. ఆ ప్రాంత నాయకుల రెఫరెన్సులు.. ఇక్కడి రాజకీయాల జోలికి వెళ్లే అవకాశం లేదు. ఆటోమేటిగ్గా అవినీతి.. ఇతర సమస్యల మీద చర్చ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం సర్కారు మీదికి ఫోకస్ షిఫ్టవుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యల మీద లోతుగా చర్చించే సినిమా అంటే అధికార పార్టీకి ఇబ్బందికరమైన విషయమే కదా?