Begin typing your search above and press return to search.

తెలంగాణ మీద పడ్డారేంటి గురూ!!

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:30 PM GMT
తెలంగాణ మీద పడ్డారేంటి గురూ!!
X
తెలుగు సినిమా కలెక్షన్స్ భారీగా రావడంలో నైజాం ఏరియా చాలా కీలకం. అయినా సరే ఇక్కడి ప్రజల మాండలికంపై తెలుగు సినిమా రూపకర్తలు అంతగా ప్రాధాన్యత చూపలేదు. కోట శ్రీనివాసరావు.. తనికెళ్ల భరణి.. తెలంగాణ శకుంతల.. వేణు మాధవ్.. ఉత్తేజ్.. నర్సింగ్ యాదవ్ వంటి కొందరు మాత్రమే తెలుగు తెరపై తెలంగాణ యాసను పలికించేవారు. వీటిలో చాలా వరకూ కామెడీ పాత్రలో విలన్ వేషాలో మాత్రమే అయి ఉండేవి.

ప్రధాన పాత్రలు తెలంగాణ తెలుగు మాట్లాడడం అనే మాటే వినిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్ 'గమ్మునుండవాయ్' అంటూ తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు అందరినీ మెప్పించేసింది. పెళ్లి చూపులు మూవీలో కూడా హీరోతో పాటు పలువురు తెలంగాణ మాండలికంలోనే మాట్లడడాన్ని.. అన్ని ప్రాంతాలవారు ఆదరించారు. గతంలో న్యూట్రల్ గా ఉండే భాషకు ప్రాధాన్యత ఉండేదని.. ఇప్పుడు సినిమాల్లో ఒరిజినాలిటీ పెరగడంతో.. సహజతత్వాన్ని చూపుతున్నారని అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.

రీసెంట్ గా అమీతుమీ చిత్రంలో ఫ్యామిలీ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర తెలంగాణ మాండలికంలో మాట్లాడ్డం కనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు.. సంభాషణలు ఎందుకు ఉండవనే ఆలోచన తనకు కలిగేదని.. అందుకే ఆ సీన్ ను అలా పిక్చరైజ్ చేశామని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెబుతున్నాడు. కామెడీ కోసమో.. నెగిటివ్ రోల్స్ కోసమో మాత్రమే కాకుండా.. ప్రధాన పాత్రలు కూడా ఇప్పుడు తెలంగాణ మాండలికంలో మాట్లాడుతుండడాన్ని.. తెలుగు తెరపై వస్తున్న కొత్తమార్పుగా చెప్పుకోవచ్చు. దూకుడు మూవీలో మహేష్ కూడా కొన్ని తెలంగాణ వాక్యాలను పలికిన సంగతి తెలిసిందే. చూస్తుంటే మొత్తం టాలీవుడ్ తెలంగాణ మీద పడిపోయింది. కాకపోతే అతిగా చూస్తే అది నెగెటివ్ రిజల్ట్ ను తెచ్చే ఛాన్సు కూడా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/