Begin typing your search above and press return to search.

ఎంజీఆర్ వర్థంతి సందర్భంగా 'తలైవి' నుంచి ఎంజీఆర్ పాత్రధారి అరవింద్ స్వామి లుక్..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 5:48 AM GMT
ఎంజీఆర్ వర్థంతి సందర్భంగా తలైవి నుంచి ఎంజీఆర్ పాత్రధారి అరవింద్ స్వామి లుక్..!
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా 'తలైవి - ది రివల్యూషనరీ లీడర్‌' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి - శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హితేష్ ఠక్కర్ - తిరుమల్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) వర్థంతిని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఎంజీఆర్ పాత్రధారి అయిన అర‌వింద్‌ స్వామి న్యూ లుక్‌ ను విడుదల చేసింది.

ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి జీవించినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. వైట్ డ్రెస్‌ లో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంజీఆర్ ని ఇందులో చూడొచ్చు. మరో పోస్టర్ లో స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేస్తూ కనిపిస్తున్నాడు. ఎంజీఆర్ జయంతి నాడు ఆయన హీరోగా నటిస్తున్న రోజుల్లోని గెటప్ లో అరవింద్ స్వామి ని చూపించిన మేకర్స్.. ఇప్పుడు వర్థంతి నాడు రాజకీయ నాయకుడిగా చూపించారు. ఈ పోస్టర్స్ ద్వారా 'మక్కల్‌ తిలగమ్‌' (ప్రజా నాయకుడు)గా తమిళ ప్రజల పిలుచుకునే ఎం.జి.ఆర్‌ వర్థంతి 'తలైవి' చిత్ర యూనిట్ ఘనమైన నివాళి అర్పించింది. జయలలిత సినీ రాజకీయ జీవితంలో ఎంజీఆర్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఇప్పుడు ఎంజీఆర్ లుక్ కూడా రివీల్ అవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 'తలైవి' చిత్రాన్ని తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. 'రోజా' 'బాంబే' వంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామికి ఇది కంబ్యాక్ మూవీగా నిలవనుంది. ఇక ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నాడు. లాక్‌ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేస్తున్నారు.