Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం?

By:  Tupaki Desk   |   31 Aug 2019 4:13 AM GMT
మెగాస్టార్ కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం?
X
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌యాణిస్తున్న ఓ విమానానికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పిందా? అంటే అవున‌నే తాజాగా స‌మాచారం అందుతోంది. ముంబై నుంచి హైద‌రాబాద్ కి ప్ర‌యాణ‌మైన విమానానికి వాయుమార్గంలో ఉండ‌గానే ఊహించ‌ని సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింద‌ని దాంతో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించిన పైలెట్ తెలివిగా వెంట‌నే ఆ విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించి విమానాశ్ర‌యంలో దించేశారు. ఆ సమయంలో విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది.

అస‌లేమైంది? అని ఆరాతీస్తే.. మెగాస్టార్ చిరంజీవి `సైరా-న‌ర‌సింహారెడ్డి` హిందీ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇటీవ‌ల ముంబై సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మీడియాతోనూ ఇంట‌రాక్ట్ అయ్యారు. సైరా టీజ‌ర్- విజువ‌ల్స్ కి ముంబై మీడియా స‌హా ఉత్త‌రాది ఆడియెన్ నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న్స్‌ ముగించుకుని చిరు విమానంలో ముంబై నుంచి హైద‌రాబాద్ కి తిరుగ ప్ర‌యాణం అయ్యారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన అర్థ గంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశార‌ని తెలుస్తోంది. పైలెట్ అప్ర‌మ‌త్త‌త వ‌ల్ల‌నే పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని చెబుతున్నారు. చిరు స‌హా ప్ర‌యాణీకులంతా క్షేమంగా స్వ‌స్థ‌లాల‌కు చేరుకోగ‌లిగార‌ని తెలుస్తోంది. విస్తారా (యూకె 869) విమానంలో త‌లెత్తిన స‌మ‌స్య ఇది. ఒక అభిమాని మెగాస్టార్ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిసింద‌ని ప్ర‌చారం అవుతోంది. అయితే ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఇటు మెగాస్టార్ చిరంజీవి కానీ లేదా కొణిదెల కాంపౌండ్ కానీ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.