Begin typing your search above and press return to search.

ఈసారీ అదే అంటే కష్టం డైరెట్రూ

By:  Tupaki Desk   |   29 July 2015 3:30 PM GMT
ఈసారీ అదే అంటే కష్టం డైరెట్రూ
X
ఏదైనా కొత్త రుచి చూపిస్తే.. అది అప్పటికి మాత్రమే కొత్తదనం అవుతుంది. కానీ ఆ తర్వాత కూడా మళ్లీ మళ్లీ అదే రుచి చూపిస్తే మొహం మొత్తుతుంది. డైరెక్టర్ తేజతో వచ్చిన సమస్య ఇదే. ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడతారు.. వాళ్ల మధ్య అంతస్తుల అంతరం ఉంటుంది.. వాళ్ల పెద్దలో లేదంటే విలన్లో ప్రేమకు అడ్డుపడతారు.. వాళ్లందరినీ ఎదిరించి, అన్ని కష్టాలూ దాటుకునని హీరో హీరోయిన్ ఎలా ఒక్కటయ్యారో చూపించే కథలతో చిత్రం, నువ్వు నేను, జయం లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీశాడు తేజ. ఐతే అప్పటికే ఎన్నో ప్రేమకథలు చూసినప్పటికీ తేజ ప్రేమకథల్ని డీల్ చేసిన తీరు జనాలకు బాగా నచ్చింది. దీంతో అతడికి భారీ హిట్లు అందించారు.

ఐతే వరుసగా భారీ హిట్లు కొట్టేసరికి తేజకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ తర్వాత కూడా తన స్టయిల్లోనే ఒకే మాదిరి సినిమాలు చేసి విసిగించాడు. జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా, కేక, నీకు నాకు డాష్.. ఇలా ఏ సినిమా చూసినా ఒకేలా అనిపించింది జనాలకు. మధ్య మధ్యలో ఒక విచిత్రం, వెయ్యి అబద్ధాలు లాంటి సినిమాలు చేసినా అవీ ఫలితాన్నివ్వలేదు. ఐతే నీకు నాకు డాష్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న తేజ ఈసారి ‘హోరాహోరీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కొత్త వాళ్లతో తనకు మంచి రికార్డుండటంతో మరోసారి న్యూ ఫేస్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దిలీప్, దక్ష అనే హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నాడు. ఐతే కాస్టింగ్ విషయంలో కొత్తదనం చూసుకుంటే సరిపోదు. కథాకథనాలు కూడా కొత్తగా ఉండాలి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు తీస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చూశాడు తేజ. మరి ఈసారైనా రూటు మార్చాడా.. మళ్లీ పాత సినిమానే చూపిస్తాడా అన్నది వేచి చూడాలి. ‘హోరాహోరీ’ ఆడియో ఈ రోజే విడుదల కాబోతోంది.