Begin typing your search above and press return to search.

థియేట‌ర్ తిండి దోపిడీపై పిడుగు పోటు

By:  Tupaki Desk   |   21 July 2018 5:10 AM GMT
థియేట‌ర్ తిండి దోపిడీపై పిడుగు పోటు
X
చిల్ల‌ర దొంగ‌త‌నానికి, ధ‌ర్జా దొంగ‌త‌నానికి తేడా ఏంటో చెప్ప‌గ‌ల‌రా? అవ‌స‌రం కోసం, కుటుంబాన్ని కాపాడుకోవ‌డం కోసం కొంద‌రు, ఉపాధి లేక మ‌రికొంద‌రు దొంగ‌లుగా మారి దొంగ‌త‌నాలు చేయ‌డం గురించి కోకొల్ల‌లుగా క‌థ‌లు విన్నాం. ప్ర‌త్య‌క్షంగా ఇలాంటివి టీవీల్లో చూస్తున్నాం. అయితే అలా కాకుండా జ‌నం అవ‌స‌రాన్ని, నిస్స‌హాయ స్థితిని తెలివిగా క్యాష్ చేసుకునేందుకు వేసే స‌రికొత్త ఎత్తుగ‌డ‌ను ద‌ర్జా దొంగ‌త‌నం అని చెప్పొచ్చు. ఇలాంటి దొంగ‌త‌నాన్ని, దోపిడీని నిలువ‌రించేందుకు ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఆప‌రేష‌న్‌ని ప్ర‌జ‌లంతా హ‌ర్షిస్తున్నారు. వేల కోట్ల రూపాయ‌ల్ని ద‌ర్జాగా దొంగ‌త‌నం చేస్తున్న మాల్స్‌, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సు ఓన‌ర్ల తాట తీస్తూ టీ-ప్ర‌భుత్వం ప‌లు కీల‌క జీవోల్ని జారీ చేసింది. థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు స‌రికొత్త‌ మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసింది.

ఇదివ‌ర‌కూ పార్కింగ్ దోపిడీకి అడ్డుక‌ట్ట వేస్తూ తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యం ఎంద‌రో ప్ర‌జ‌ల్ని సేవ్ చేస్తోంది. ఇప్పుడు అడ్డూ ఆపూ లేకుండా థియేట‌ర్ల‌లో తిండి దోపిడీకి పాల్ప‌డుతున్న దుర్మార్గ‌పు మ‌ల్టీ ప్లెక్సు య‌జ‌మానుల‌పై ఉక్కుపాదం మోపేందుకు మ‌రో క‌ఠిన నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తేనుంది. సెప్టెంబ‌ర్ 1 అందుకు ముహూర్తం. ఇక‌పై థియేట‌ర్ల‌లో అమ్మే ఏ తిండి ప‌దార్థ‌పు ప్యాకింగుపై అయినా క‌చ్ఛితంగా ఎంఆర్‌పి ధ‌ర ఉండాల్సిందే. అది కూడా మార్కెట్ ధ‌ర‌కు వేయాల్సిందే. అద‌నంగా హిడెన్ ఎజెండాతో బాదేసే అద‌న‌పు బాదుడు ఇక కుద‌ర‌దు. కోక్, స‌మోసా నుంచి వాట‌ర్ బాటిల్‌, పాప్‌కార్న్ వ‌ర‌కూ ప్ర‌తిదీ ఇక‌పై ఎంఆర్‌పీ ధ‌ర‌కే అమ్మాలి. ఒక‌వేళ అలా అమ్మ‌ని వాళ్ల తాట తీసేందుకు కొన్ని టోల్‌ఫ్రీ నంబ‌ర్ల‌ను థియేట‌ర్ల‌లో గోడ‌ల‌పై ముద్రించ‌నున్నారు. అది కూడా అమ్మే ఫుడ్ స్టాల్స్ ద‌గ్గ‌రే ఇవి ఉంటాయి. మాల్స్‌ లో, థియేట‌ర్ల‌లో ఎంఆర్‌పీ లేకుండా అమ్మితే ఇక క‌ట‌క‌టాల పాలేన‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ల్టీ ప్లెక్సు ల్లో అస‌లు ఎంఆర్‌పీ రేటు అన్న‌దే ముద్రించ‌కుండా నాలుగైదు రెట్లు లాభాల‌కు అమ్మేస్తున్న ధ‌ర్జా దొంగ‌లు ఇక‌పై తోక ముడ‌వాల్సిందేన‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇక‌మీద‌ట‌ రెగ్యుల‌ర్‌గా థియేట‌ర్ స్టాల్స్‌పై అధికారుల చెక‌ప్ ఉంటుంది. ఆ మేర‌కు తెలంగాణ మెట్రాల‌జీ డిపార్ట్‌మెంట్ హుకుం జారీ చేసింది. అయితే అవినీతి అధికారులు ఎక్క‌డ ఉన్నా, య‌థారాజా త‌థా ప్ర‌జా అన్న‌ట్టే ఈ తంతు సాగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికైతే తెలంగాణ రాష్ట్ర మెట్రాల‌జీ డిపార్ట్‌మెంట్ నుంచి థియేట‌ర్‌, మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యాల‌కు తాఖీదులు అందాయి. ఆగ‌స్టు- 1 నుంచి ఈ స‌రికొత్త పాల‌సీ పై స‌మీక్ష స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 29-30 తేదీల్లో థియేట‌ర్‌, మాల్స్ య‌జ‌మానుల‌తో జిల్లా స్థాయి అధికారులు స‌మీక్ష‌లు నిర్వ‌హించనున్నారు.