Begin typing your search above and press return to search.

ఆర్ ఎఫ్‌ సీకి పోటీ స్టూడియో కాదే!

By:  Tupaki Desk   |   19 Jun 2019 4:10 AM GMT
ఆర్ ఎఫ్‌ సీకి పోటీ స్టూడియో కాదే!
X
ఆంధ్ర ప్ర‌దేశ్ - తెలంగాణ విభ‌జ‌న ఉద్య‌మ కాలాన్ని టాలీవుడ్ సినీపెద్ద‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. టాలీవుడ్ రెండుగా విడిపోతుంద‌ని... ఒక‌టి హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌... రెండోది ఏపీలో అభివృద్ధి చెందుతుంద‌ని మాట్లాడుకున్నారంతా. అయితే విభ‌జ‌న త‌ర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వం ఆంధ్రా సినిమావాళ్ల‌కి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌నివ్వ‌మ‌ని భ‌రోసానివ్వ‌డంతో టాలీవుడ్ ఎటూ వెళ్ల‌లేదు. య‌థావిధిగా కార్య‌క‌లాపాలు హైద‌రాబాద్ నుంచే సాగిస్తున్నారు. అయితే ప‌రోక్షంగా విజ‌య‌వాడ‌.. వైజాగ్.. తిరుప‌తి లాంటి చోట్ల చాంబ‌ర్ కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌డం మిన‌హా పూర్తిగా ఏపీ టాలీవుడ్ ఏర్పాటు అనేది ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌నేలేదు.

అయితే విభ‌జ‌న ముందు వేరొక ప‌రిణామం ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. తెలంగాణ‌లో తెలంగాణ సినిమా బ‌త‌కాలి. తెలంగాణ ప్రాంత యాస‌.. భాష .. సంస్కృతిపై సినిమాలు తీయాల‌న్న‌ది ఆ చ‌ర్చ సారాంశం. అందుకోసం స్థానిక యువ‌త‌లో సినిమా ఔత్సాహికుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేలా పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ త‌ర‌హాలో ఒక సంస్థ‌ను ప్రారంభించి శిక్ష‌ణ‌నివ్వాల‌ని.. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుబంధంగా ఒక స్టూడియో నిర్మాణం జ‌ర‌గాల‌ని త‌ల‌పోశారు. అయితే అందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. ఇన్నాళ్లు అస్స‌లు కార్య‌రూప‌మే దాల్చ‌లేదు. తెలంగాణ విడిపోయి కేసీఆర్ సార‌థ్యంలో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక రామోజీ ఫిలింసిటీతో పోటీప‌డేంత‌టి పెద్ద స్టూడియోని నిర్మించ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ అది జ‌ర‌గ‌లేదు.

అయితే పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ త‌ర‌హా ఎప్పుడు ప్రారంభిస్తారు? అంటూ మూడు నెల‌ల క్రిత‌మే ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ ని ప్ర‌శ్నిస్తే.. దానికి సంబంధించిన వివ‌రాల్ని `తుపాకి`తో మాట్లాడారు. సీఎం కేసీఆర్ .. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని వ‌ద్ద ప్ర‌పోజ‌ల్ పెట్టాం. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మా ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతుంద‌ని భావిస్తున్నాం అని అన్నారు. అయితే ఇటీవ‌ల దానిపై సరైన స‌మాచారం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఐదెక‌రాల్లో ఫిలిం స్టూడియో నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే అప్ప‌ట్లో రాచ‌కొండ గుట్ట‌ల్లో స్టూడియో అంటూ ప్ర‌చార‌మైనా ఆ ప‌రిస‌రాల్లో ఇది ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఇక చిత్ర‌పురి అధ్య‌క్షుడు కొమ‌ర వెంక‌టేష్ అందించిన స‌మాచారం ప్ర‌కారం... రామోజీ ఫిలింసిటీ ప‌రిస‌రాల్లో వేరొక డోన‌ర్ స్టూడియోకి స్థ‌లం ఇచ్చేందుకు ముందుకొచ్చారని దానిని ఫైన‌ల్ చేసే వీలుంద‌ని కొద్దిరోజుల క్రితం వెల్ల‌డైంది.

ఇంత‌కీ ఈ స్టూడియోని నిర్మించేది ఎవ‌రు? అంటే.. దర్శకుడు ఎన్ శంకర్ సార‌థ్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా కొత్త‌ స్టూడియో నిర్మాణానికి ఐదెక‌రాల్ని ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మ కాలంలో సినీద‌ర్శ‌కుడిగా ఎన్.శంక‌ర్ ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచారు. ఆ స‌మయంలోనే సినీస్టూడియో నిర్మాణానికి ఆయ‌న ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అందుకు ఆయ‌న‌కు ఇది కానుక అని స‌న్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ‌లో తొలి తెలంగాణ స్టూడియో ఇదేన‌ని చెప్పొచ్చు. ఇక ఇప్ప‌టికే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ పెద్ద‌ల‌కు ఐదారు స్టూడియోలు ఉన్న సంగ‌తి తెలిసిందే. రామానాయుడు స్టూడియోస్- అన్న‌పూర్ణ స్టూడియోస్- సార‌థి స్టూడియోస్- రామ‌కృష్ణ స్టూడియోస్- శబ్ధాల‌యా స్టూడియోస్- ప‌ద్మాల‌యా స్టూడియోస్ .. ఇవ‌న్నీ హైద‌రాబాద్ లో ఫిలిం ఇండ‌స్ట్రీ పాదుకునేందుకు దోహ‌దం చేసిన స్టూడియోలు అని చెప్పొచ్చు.