Begin typing your search above and press return to search.

తెలంగాణలో 4 ఆటలు కాదు.. 5 ఆటలా?

By:  Tupaki Desk   |   21 March 2016 1:22 PM GMT
తెలంగాణలో 4 ఆటలు కాదు.. 5 ఆటలా?
X
సినీ ప్రియులకు పండగే. సినిమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. దశాబ్దాలకు తరబడి సాగుతున్న రూల్స్ ను బ్రేక్ చేసేసి.. తనదైన శైలిలో విలక్షణ నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు పడనున్నాయి. ఇప్పటివరకూ సూచనగా ఉన్న ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కానీ సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం చిన్న సినిమాలకు పండగేనని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకూ తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు నాలుగు ఆటలు మాత్రమే వేసే స్థానే..ఐదు ఆటలు వేసేలా ఆదేశాలు జారీ చేసే వీలుండటమే దీనికి కారణం.

చిన్న సినిమాకు థియేటర్లు దొరకటం కష్టంగా మారిన నేపథ్యంలో.. అందుకు భిన్నంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే వీలుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ధియేటర్లలో రోజూ ఐదు సినిమాలు వేసే అవకాశాన్ని ఇవ్వటం అందులో ఒకటి. అంతేకాదు.. ఐదో షో కచ్ఛితంగా చిన్న సినిమా అయి ఉండాలన్న సూచనను తెలంగాణ సబ్ కమిటీ చేసింది.

అంతేకాదు.. చిన్న సినిమాల పరిమితిని ఇప్పటివరకూ ఉన్న 30 థియేటర్ల నుంచి 50 థియేటర్లకు పెంచాలన్న నిర్ణయం కూడా తీసుకుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. అధికారిక ఆదేశాలు వెలువడితే మాత్రం.. తెలంగాణలోని థియేటర్ల షో టైమింగ్స్ మొత్తంగా మారిపోవటం ఖాయం. చూస్తుంటే.. అలాంటి రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.