Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: తెలంగాణ సినిమా షైనింగ్

By:  Tupaki Desk   |   27 Aug 2017 6:14 AM GMT
హాట్ టాపిక్: తెలంగాణ సినిమా షైనింగ్
X
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు వాళ్ల మధ్య ఓ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో తెలంగాణ సినిమా షైనింగ్ అంటూ తెలంగాణ వాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. గత నెలలో వచ్చిన ‘ఫిదా’.. రెండు నెలల కిందట విడుదలైన ‘అమీతుమీ’.. గత ఏడాది వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాల్లో నేటివ్ తెలంగాణ ఎంటర్టైన్మెంట్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమాలన్నింటిలోనూ తెలంగాణ నేటివిటీని బాగా వాడుకున్నారు.

ఈ నాలుగు సినిమాల్ని చూపించి.. తెలంగాణ సినిమా షైనింగ్ అంటూ కొందరు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో చర్చను లేవదీశారు. ఐతే ఇవి తెలంగాణ సినిమాలైతే.. మిగతావన్నీ ఆంధ్రా సినిమాలా అంటూ మరోవైపు నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. ‘బాహుబలి’ సినిమాను దేశమంతా ఆదరించిందని.. అలాంటి సినిమాను హద్దులు పెడతారా అని ప్రశ్నిస్తోంది మరో వర్గం. ఇదంతా వదిలేసి తెలుగు సినిమా షైనింగ్ అనాలి తప్ప ఇలా సినిమాలకు హద్దులు పెట్టడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే తెలంగాణ వాళ్లు పైన చెప్పుకున్న సినిమాల్ని ఎక్కువ ఓన్ చేసుకుని.. వాటిని ప్రత్యేకంగా చూడటానికి.. ప్రౌడ్ గా ఫీలవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు తెలంగాణ భాషను తెలుగు సినిమాల్లో చిన్న చూపు చూశారన్న అభిప్రాయం ఆ ప్రాంత వాసుల్లో ఉంది. ఎక్కువగా విలన్ పాత్రలకు.. కామెడీ క్యారెక్టర్లకు ఆ భాషను పరిమితం చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. కానీ ఈ మధ్య ప్రధాన పాత్రధారులు తెలంగాణ భాషను వాడుతున్నారు.

‘ఫిదా’ లాంటి సినిమాలకు తెలంగాణ యాసే అలంకారంగా నిలిచింది. ఆ భాష.. యాస నుంచే చక్కటి వినోదం పండించారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఆ భాష ఆకట్టుకుంది. ఆ భాషలోని మాధుర్యమేంటన్నది అందరికీ తెలిసొచ్చింది. పైన చెప్పుకున్న మిగతా సినిమాల్లోనూ తెలంగాణ భాషను.. యాసను చక్కగా వాడుకున్నారు. వినోందం పండించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వారు ఆ సినిమాల్ని మరింతగా ఓన్ చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఐతే అదే సమయంలో దీన్ని మరింత ప్రత్యేకంగా చూసి ఒక హద్దులు గీయడం అన్నది సరి కాదు.