Begin typing your search above and press return to search.

తెలుగు నటుడి వ్యాఖ్యలు.. భగ్గుమన్న కన్నడ ఇండస్ట్రీ

By:  Tupaki Desk   |   13 Dec 2020 1:16 PM GMT
తెలుగు నటుడి వ్యాఖ్యలు.. భగ్గుమన్న కన్నడ ఇండస్ట్రీ
X
విజయ్ రంగరాజు అనే సీనియర్ నటుడు చేసిన కన్నడ దివంగత నటుడు విష్ణువర్ధన్‌ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల వల్ల టాలీవుడ్‌ మీదే కన్నడిగులు దండెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఫైటర్ పాత్రలు చేసిన విజయ్ రంగరాజు.. చాలా ఏళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. ఐతే తాజాగా ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో పాత విషయాలు పంచుకుంటూ ట్రెండ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది గురించి ఆయన తన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. రామిరెడ్డి మరణం గురించి కూడా ఆయన సంచలన విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఆయన బాగా ఔట్ స్పోకెన్ అనిపిస్తోంది. అలాగే జనాల దృష్టిని ఆకర్షించడానికి కూడా ఆయనీ మార్గం ఎంచుకుని ఉండొచ్చు. ఇంతకీ ప్రస్తుత వివాదం ఏంటంటే..

కన్నడలో రాజ్‌కుమార్ తర్వాత అంతటి దిగ్గజ స్థాయి ఉన్న నటుడు విష్ణువర్ధన్. ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు విజయ్ రంగరాజు. రాజ్‌కుమార్‌తో తాను ముత్తైద భాగ్య అనే కన్నడ సినిమాలో న‌టించాన‌ని.. తాను సెట్స్‌లోకి వెళ్లిన‌పుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగ‌నం చేసుకోవ‌డాన్ని ఆయన ఓర్చుకోలేకపోయాడని.. వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరినీ సెట్స్ నుంచి బయటికి పంపమని ఆదేశించాడని విజ‌య్ రంగ‌రాజు అన్నాడు. దీని గురించి విష్ణువ‌ర్ధ‌న్‌ను అడిగితే.. తాను డిస్ట‌ర్బ్ అవుతున్నాన‌ని చెప్పాడ‌ని.. ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు.

ఐతే ఈ వ్యాఖ్యలు కన్నడలో స్టార్ల దృష్టికి వెళ్లాయి. పునీత్ రాజ్ కుమార్, సుదీప్ సహా చాలామంది ప్రముఖ నటులు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఒక దివంగత నటుడి గురించి ఇలా మాట్లాడతారా.. ఆయనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పునీత్ ట్విట్టర్లో పోస్టు పెట్టగా.. సుదీప్ వీడియో సందేశం వెలువరించాడు. ఒక ఆర్టిస్టు అయి ఉండి ఒక లెజెండరీ, దివంగత ఆర్టిస్టును గౌరవించడం తెలియదా అంటూ విజయ్ రంగరాజుపై కన్నడిగులు మండిపడుతున్నారు. త‌న వ్యాఖ్య‌లు దుమారం రేప‌డంతో విజ‌య్ రంగ‌రాజు స్పందించాడు. తాను త‌ప్పు మాట్లాడాన‌ని, పాపం చేశాన‌ని, త‌న‌ను విష్ణువ‌ర్ధ‌న్ అభిమానులు ‌క్షమించాల‌ని చేతులు జోడించి ఏడుస్తూ ఒక వీడియో షేర్ చేశాడాయ‌న‌.