Begin typing your search above and press return to search.

టార్గెట్.. 200 కోట్లు

By:  Tupaki Desk   |   6 Jan 2017 10:30 PM GMT
టార్గెట్.. 200 కోట్లు
X
మొత్తానికి సంక్రాంతి వచ్చేస్తోంది. భారీ సినిమాల సందడి తెచ్చేస్తోంది. ఈ పండక్కి మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా బాలకృష్ణల మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్నాం. చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ - బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. అలాగే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘శతమానం భవతి’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలు మూడూ కలిపి కలెక్షన్ల మోత మోగిస్తాయని భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల గ్రాస్ వసూళ్లు 200 కోట్లు దాటేస్తాయని అంచనా.

మెగాస్టార్ సినిమాకు వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.90 కోట్లును టచ్ చేసింది. షేర్ ఆ మార్కును దాటితేనే సినిమా హిట్టన్నమాట. ఇక గ్రాస్ వసూళ్లు రూ.130-140 కోట్ల దాకా ఉండాలి. ‘ఖైదీ నెంబర్ 150’ తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ కావడం.. పైగా చిరంజీవి దశాబ్దం విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వడం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని.. వసూళ్ల విషయంలో ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఈ సినిమా కనీసం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం లాంఛనమే అంటున్నారు. ఐదు రోజుల లాంగ్ వీకెండ్.. పైగా సంక్రాంతి సెలవులున్నాయి కాబట్టి ‘ఖైదీ నెంబర్ 150’ భారీగానే కలెక్షన్లు రాబట్టే అవకాశముంది.

ఇక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులు మరో గొప్ప విజువల్ వండర్ చూడబోతున్న ఫీలింగ్‌ లో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి విశేషమూ పాజిటివ్‌ గానే ఉంది. కాబట్టి దీనికి కూడా ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదు. ‘ఖైదీ నెంబర్ 150’తో పోలిస్తే కలెక్షన్లు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ.. ఈ సినిమా కూడా కనీసం 80 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక శర్వానంద్ సినిమా ‘శతమానం భవతి’ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. పెద్ద సినిమాల తాకిడి ఉన్నప్పటికీ ఇది కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ మంచి వసూళ్లే రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఓ 30 కోట్ల గ్రాస్ వసూలు చేసినా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం కష్టమేమీ కాదు. అదే జరిగితే టాలీవుడ్లో ఒక సీజన్లో వసూలైన అత్యధిక గ్రాస్ మొత్తం ఇదే అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/