Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో ఓ అనూహ్య పరిణామం

By:  Tupaki Desk   |   10 July 2016 5:30 PM GMT
టాలీవుడ్లో ఓ అనూహ్య పరిణామం
X
బడ్జెట్లు భారీగా పెరిగిపోయిన తరుణంలో ప్రస్తుతం సినిమా తీయడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు. పేరున్న నిర్మాతలు సైతం పక్కా ప్లానింగ్ తో సెట్స్ మీదికి వెళ్లినా చివరికి అనుకున్న బడ్జెట్లో సినిమాలు పూర్తవడం లేదు. ఎంత లో బడ్జెట్లో సినిమాలు తీద్దామన్నా ఖర్చు తడిసిమోపెడవుతోంది. భారీగా పెరిగిపోయిన ప్రొడక్షన్ కాస్ట్ వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగులో ఓ సినిమా తీయాలంటే కచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ అయిన సినీ కార్మికులతోనే పని చేయించుకోవాలి. వాళ్లు ఎంత చెబితే అంత చెల్లించాలి. ఈ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ టెక్నాలజీతో తక్కువ ఖర్చులో సినిమాలు తీసుకునే సౌలభ్యం ఉంది. కానీ రిజిస్టరైన సినీ కార్మికులతో పని చేయించుకుండా సినిమాలు తీస్తే వాటిని ఫిలిం ఛాంబర్ గుర్తించదు. ఆ సినిమాలకు ఎలాంటి సహకారం అందదు. దీంతో చాలా వరకు యంగ్ టాలెంట్ యూట్యూబ్ కు పరిమితమైపోతోంది. షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ యూట్యూబ్ ఛానెళ్లలో రిలీజ్ చేసుకుంటోంది. వీళ్లలో చాలా కొద్ది మందికి మాత్రమే రెగ్యులర్ సినిమాల్లో అవకావాలు దక్కుతున్నాయి.

ఐతే ఫిలిం ఛాంబర్ ఈ డిజిటల్ ఫిల్మ్ మేకర్స్ ను గుర్తించాలని భావిస్తున్నట్లు సమాచారం. స్టూడియో యజమానులు.. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లతో పాటు ఐదో సెక్టార్ గా ఈ డిజిటల్ ఫిల్మ్ మేకర్స్ కు గుర్తింపు ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించినట్లు తెలిసిందే. ఇది టాలీవుడ్లో పెను మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ నిర్ణయం అమల్లోకి వస్తే.. గుర్తింపు పొందిన సినీ కార్మికులతోనే పని చేయించుకోవాలన్న షరతులేమీ ఉండవు. తమ పరిమితుల్లోనే తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడానికి అవకాశముంటుంది. వాటికి ఫిలిం ఛాంబర్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి.. గుర్తింపు.. విడుదల విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో మినీ థియేటర్లు రాబోతున్న నేపథ్యంలో థియేటర్ల సమస్య కూడా తలెత్తకపోవచ్చు. చిన్న సినిమాలకు ఈ పరిణామం గొప్ప ఊపునిస్తుందని భావిస్తున్నారు.