Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: వైజాగ్ లో మెగా టాలీవుడ్ నిర్మాణం!

By:  Tupaki Desk   |   4 Jan 2020 1:30 AM GMT
ట్రెండింగ్‌: వైజాగ్ లో మెగా టాలీవుడ్ నిర్మాణం!
X
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి రాజ‌ధానిని త‌ర‌లిస్తున్న అంశం ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర స‌హా ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమ‌రావ‌తి నుంచి ద‌ఫ‌ద‌ఫాలుగా రాజ‌ధానిని త‌ర‌లిస్తున్నార‌న్న చ‌ర్చ ఉత్త‌రాంధ్ర‌లో వేడెక్కిస్తోంది. ప‌నిలో ప‌నిగా 90 శాతం షూటింగులు జ‌రిగే విశాఖ‌- అర‌కు ప‌రిస‌ర ప్రాంతాల్లోనే మ‌రో కొత్త టాలీవుడ్ ని నెల‌కొల్పేందుకు యువ ముఖ్య‌మంత్రి వై.యస్.జ‌గన్ మోహ‌న్ రెడ్డి అడుగులు వేస్తున్నార‌న్న సంకేతాలు ఇప్ప‌టికే అందాయి. అందుకు ఆయ‌న సుముఖంగా ఉన్నార‌ని ఇటీవ‌లే విశాఖ ఉత్స‌వ్ లో వైకాపా మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం వైజాగ్ టాలీవుడ్ అంశంపై టాలీవుడ్ సినీపెద్ద‌ల్లోనూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు ధీటుగా వైజాగ్ టాలీవుడ్ ని అభివృద్ధి చేసేందుకు జ‌గ‌న్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌న్న ముచ్చ‌ట అడుగ‌డుగునా క‌నిపిస్తోంది. ఈ ప్ర‌య‌త్నం వ‌ల్ల‌.. ``ఐటీ- పరిశ్ర‌మ‌లు- సినిమా-క‌ళ‌లు`` సాంగ‌త్యంతో అభివృద్ధికి నాంది ప‌లికే స‌రికొత్త ఉద్య‌మం ఇద‌ని.. మునుముందు ఉత్త‌రాంధ్ర‌లో ఉపాధి పెంచేందుకు ఇది ఎంతో ఉప‌క‌రిస్తుంద‌న్న చ‌ర్చా ఉత్త‌రాంధ్ర యువ‌త‌లో విస్త్ర‌తంగా సాగుతోంది.

ఇక వైజాగ్ టాలీవుడ్ కి సినీ పెద్ద‌లు అనుకూలంగా స్పందిస్తుండ‌డం మ‌రో ముంద‌డుగు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయినా ఆ వెంట‌నే ఇక్క‌డి నుంచి వెళ్లేందుకు సినీపెద్ద‌లెవ‌రూ అనుకూలంగా లేర‌ని ప్ర‌చార‌మైంది. అది చివ‌రికి నిజ‌మే అయ్యింది. రామానాయుడు స్టూడియోస్ అధినేత డి.సురేష్ బాబు.. విశాఖ ఎఫ్‌.ఎన్.సీసీ అధినేత కె.ఎస్.రామారావు సైతం కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ని క‌లిసి ముచ్చ‌టించేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి.

ఇక విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటు అన్న ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి విశాఖ టాలీవుడ్ పైనా తామ‌ర‌తంప‌ర‌గా రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. తాజాగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) 2020 డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో మెగాస్టార్ వ్యాఖ్య‌లు ప‌రిశీలిస్తే.. `వైజాగ్ లో మెగా టాలీవుడ్` ఖాయ‌మేన‌న్న సంకేతాలు అందాయి. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో టాలీవుడ్ అభివృద్ధి గురించి ముచ్చటించాన‌ని చెప్పిన మెగాస్టార్... వైజాగ్ టాలీవుడ్ విష‌యంలో ఏం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌తో ర‌మ్మ‌ని కోరార‌ని అర్థం వ‌చ్చేలా మాట్లాడ‌డం హాట్ టాపిక్ గా మారింది. కేవ‌లం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే కాదు.. మ‌రో టాలీవుడ్ నిర్మాణం ఆవ‌శ్య‌క‌త గురించి చిరు జ‌గ‌న్ తో ముచ్చ‌టించార‌న్న గుస‌గుస‌లు 900 మంది స‌భ్యులున్న మూవీ ఆర్టిస్టుల్లో చ‌ర్చ‌కొచ్చింది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారిని క‌లిసిన‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించాన‌ని మెగాస్టార్ అన్నారు. ఏపీలో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి త‌న‌వంతు సాయం అందిస్తాన‌ని జ‌గన్ హామీ ఇచ్చార‌ని చిరు అన్నారు. ప‌రిశ్ర‌మ విష‌య‌మై సాయం అడిగితే.. ``చెప్పండి అన్నా.. మీరంతా అనుకుని చెబితే ప్రారంభిద్దాం`` అని జ‌గ‌న్ అన్నారు అంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్య‌ల్లో ఎంతో అంత‌రార్థం ఇమిడి ఉంద‌ని ఉత్త‌రాంధ్ర- వైజాగ్ యూత్ భావిస్తున్నారు. ముఖ్యంగా మ‌రో మెగా టాలీవుడ్ నెల‌కొల్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న ఉత్సాహం అక్క‌డ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక త్వ‌ర‌లోనే సినిమాటోగ్ర‌ఫీ మంత్రి ఎవ‌రో ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ‌న్ తెలిపార‌ని.. మంత్రిగారితోనే మీరు మాట్లాడండి! అన్నీ చేద్దాం.. అని హామీ ఇచ్చార‌ని చిరు మా డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్రమంలో తెలిపారు. రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించే విష‌యంలోనే కాదు.. మ‌రో కొత్త టాలీవుడ్ నిర్మాణానికి మెగాస్టార్ సానుకూలంగా ఉన్నార‌న్న సంకేతాలు అందిన‌ట్టే. వైజాగ్ టాలీవుడ్ కి చిరంజీవి- అల్లు అర‌వింద్- గంటా శ్రీ‌నివాస‌రావు- బొత్స స‌త్య‌నారాయ‌ణ‌- అవంతి శ్రీ‌నివాస్ త‌దిత‌ర పెద్ద‌లు.. ఇప్ప‌టికే అనుకూలంగా ఉన్నార‌ని వీరంతా క‌లిసి ఏదో ఒక కొత్త ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారన్న ముచ్చ‌టా ఇప్పుడు వేడెక్కిస్తోంది. మొత్తానికి వైజాగ్ లో మెగా టాలీవుడ్ రూప‌క‌ల్ప‌న‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్టేన‌న‌డానికి ఇంత‌కంటే గొప్ప‌ సంకేతం అవ‌స‌రం లేదన్న చ‌ర్చా హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు వేడెక్కిస్తోంది.