Begin typing your search above and press return to search.

టీజర్ కి ముందు.. ఆ ముందు.. అంతకు ముందు

By:  Tupaki Desk   |   1 March 2018 2:31 PM GMT
టీజర్ కి ముందు.. ఆ ముందు.. అంతకు ముందు
X
ముందస్తు.. ఈ మాట సహజంగా రాజకీయాల్లో వింటూ ఉంటాం. తాము మళ్లీ కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉన్న అధికార పార్టీలు.. ముందస్తు ఎన్నికలకు వస్తుంటాయి. ఇప్పుడీ హంగామా సినిమాల్లో కూడా కనిపిస్తోంది. సినిమాకు ముందు ట్రైలర్ విడుదల చేసి హైప్ పెంచడం.. దానికంటే ముందు పాటలు విడుదల చేయడం గతంలో ఉన్న ట్రెండ్. కానీ ఇప్పుడు మరీ పిచ్చి పట్టిన రేంజ్ లో టీజర్ల హంగామా ఉంటోంది.

ఓ రెండు నిమిషాల ట్రైలర్ ను విడుదల చేసేందుకు.. కొన్ని వారాల ముందు ఓ 30 సెకన్ల టీజర్ ఇవ్వడం కొన్ని రోజులుగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు హంగామా మరీ శృతి మించిపోతోంది. ప్రీ టీజర్లు.. వాటికి సంబంధించిన టీజర్లను కూడా ఇస్తూ ఏవేవో పేర్లతో గందరగోళం సృష్టిస్తున్నారు. మహేష్ బాబు సినిమా భరత్ అనే నేనును తీసుకుంటే.. సాయంత్రం 6గంటలకు ఓ అనౌన్స్ మెంట్ ఇస్తున్నామన్నారు. ఆ టైముకు.. టీజర్ ఎప్పుడొస్తుందో చెప్పారు. అంటే టీజర్ నే ముందస్తు అందామంటే.. దానికి ముందు రెండు ప్రకటనలతో ప్రచారం వచ్చిందన్న మాట.

రామ్ చరణ్ మూవీ రంగస్థలం విషయంలోనూ ఇదే చేస్తున్నారు. రెండో లిరకల్ సాంగ్ ను రిలీజ్ చేయాలి. ఆ పాట గురించి చెప్పేందుకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. లిరికల్ వీడియో వచ్చిన కొన్ని రోజులకు మళ్లీ వీడియో ప్రోమో అన్నా ఆశ్చర్యం లేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్యకు కూడా ఇలాంటి హంగామానే చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పోస్టర్లు.. ఓ టీజర్ ఇచ్చాక.. ఇప్పుడు మళ్లీ పోస్టర్ ఇంపాక్ట్ అంటున్నారు. రిలీజ్ లోగా ఇంకెన్ని ముందస్తులు వస్తాయో చూడాలి.

ప్రచారంలో కొత్త పుంతలు తొక్కడం.. కొత్త ఐడియాలు వేయడం చేతకాక.. ఇలా ఒకటే అంశానికి మూడు నాలుగు ప్రకటనలు చేసుకుంటున్నారని జనాలు జోకులు వేసుకుంటున్నారు. పబ్లిసిటీ విషయంలో మన కమర్షియల్ మూవీ మేకర్స్ ఎప్పటికి అప్డేట్ అవుతారో.. కొత్తగా థింక్ చేస్తారో..