Begin typing your search above and press return to search.

వైజాగ్ లో టాలీవుడ్.. తెలంగాణా సినిమా కు మేలు?

By:  Tupaki Desk   |   27 Dec 2019 6:26 AM GMT
వైజాగ్ లో టాలీవుడ్.. తెలంగాణా సినిమా కు మేలు?
X
తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదట్లో హైదరాబాద్ లో లేదు. చెన్నైలో ఉండేది. అయితే తర్వాత కాలంలో తెలుగు ఇండస్ట్రీ నెమ్మదిగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలి రావడంతో ఎఎన్నార్ లాంటివారు కీలక పాత్ర పోషించారు. నివాసం చెన్నై నుంచి హైదరాబాద్ కు మార్చుకుని ఇక్కడకు మిగతా వారు కూడా షిఫ్ట్ అయ్యేలా ప్రేరణ గా నిలిచారు. ఇప్పుడు హైదరాబాద్ తెలుగు సినిమా కు రాజధాని గా ఉంది.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సినీ పరిశ్రమ తరలిపోతుందా.. అలా అయితే ఎక్కడికి తరలిపోతుంది అనే దిశగా చర్చలు సాగాయి కానీ అలా ఏమీ జరగలేదు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అయితే ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకురావడం.. అందులో వైజాగ్ కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే సూచనలు ఇవ్వడంతో ఈ సినీ పరిశ్రమ తరలింపు వ్యవహారం మరోసారి తరపైకి వచ్చింది.

వైజాగ్ లో ఇప్పటికే రెగ్యులర్ గా షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి. పలువురు సినీ ప్రముఖులకు అక్కడ వందల ఎకరాల్లో భూములు ఉన్నాయి. భవిష్యత్తులో స్టూడియోలు నిర్మాణం చేయాలనే ఆలోచనతో ముందుచూపుగా భూమి కొనుగోలు చేశారు. అయితే ఇప్పటివరకూ ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో స్టూడియో నిర్మాణం అయితే చేపట్టలేదు. ఇప్పుడు జగన్ కనుక కొంత సపోర్ట్ ఇచ్చిన పక్షంలో అక్కడ స్టూడియోలో నెలకొల్పేందుకు.. సినీ పరిశ్రమ ను అభివృద్ధి చేసేందుకు కొందరు సినీ ప్రముఖులు సుముఖం గా ఉన్నారని అంటున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమైన సమస్యల పై దృష్టి సారిస్తున్నారని.. సినీ పరిశ్రమ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితి లో ఎఎన్ఆర్ అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టు ఎవరు వైజాగ్ కు వెళ్లి అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రయత్నం చేస్తారు? ఎవరు అక్కడ ఫిలిం స్టూడియోలు నిర్మిస్తారు? ఇదిలా ఉంటే ఆంధ్రా ఇండస్ట్రీ.. తెలంగాణ ఇండస్ట్రీ విడివిడిగా ఉంటే తెలంగాణా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని కొందరు తెలంగాణా మేథావులు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ పై కొందరి గుత్తాధిపత్యం తగ్గితే చిన్న సినిమాల మనుగడ ఉంటుందని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముంబై అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది కానీ అక్కడ మరాఠి సినీ పరిశ్రమ ఉందని ఎవరూ అనుకోరు. అయితే ఈ బాలీవుడ్ ఆధిపత్యం కారణంగా మరాఠి పరిశ్రమకు ఎక్కువ గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు తెలంగాణా సినీ పరిశ్రమ పరిస్థితి కూడా అలాగే ఉందని.. భవిష్యత్తులో ఈ పరిస్థితి మారి తెలంగాణా సినీ పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందాలంటే టాలీవుడ్ కొంత భాగం వైజాగ్ కు వెళ్ళడం మేలనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.