Begin typing your search above and press return to search.

ఛానెళ్లపై బ్యాన్ ఎందుకు ఆగింది?

By:  Tupaki Desk   |   2 May 2018 8:17 AM GMT
ఛానెళ్లపై బ్యాన్ ఎందుకు ఆగింది?
X
శ్రీరెడ్డి ఇష్యూ విషయంలో మీడియా తీరుకు నిరసనగా టాలీవుడ్ పెద్దలు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. కొన్ని ఛానెళ్ల మీద నిషేధం విధించి.. వాళ్లకు సినిమాలకు సంబంధించిన ఏ కంటెంట్ ఇవ్వొద్దని.. ప్రకటనలు కూడా జారీ చేయొద్దని సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకున్నారు. ఇక నిషేధం గురించి ప్రకటన చేయడమే తరువాయి అనుకుంటుండగా కథ మారింది. తాజాగా మీడియాను కలిసిన నాగబాబు ఇలాంటి ఉద్దేశాలమీ ఇండస్ట్రీ పెద్దలకు లేవని తేల్చేశాడు. మరి ఇంతలో ఏమైంది? మధ్యలో ఏం జరిగింది? టీవీ ఛానెళ్లపై బ్యాన్ విషయంలో పరిశ్రమ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? అన్న ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. వీటికి సమాధానాలు దొరికాయి.

టీవీ ఛానెళ్లపై బ్యాన్ నిర్ణయం తీసుకున్న సంగతి గుర్తించే తెలంగాణ జర్నలిస్టు సంఘాల నేతలు.. పరిశ్రమ పెద్దలతో సమావేశమయ్యారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో పాలు పలువురు మీడియా ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాన్ చేయడం వల్ల తలెత్తే పరిణామాల గురించి హెచ్చరించడంతో పాటు.. శ్రీరెడ్డి ఇష్యూలో పరిశ్రమ తప్పుల్ని కూడా ఎత్తి చూపినట్లు తెలిసింది. కాస్టింగ్ కౌచ్ గురించి ముందు నుంచే చర్చ జరుగుతోందని.. హాలీవుడ్లో ఆ విషయంపై రగడ జరిగిందని.. ఆ నేపథ్యంలోనే టీవీ ఛానెళ్ల చర్చలు నడిచాయి కానీ.. కొత్తగా టాలీవుడ్ మీద ఎవరూ టార్గెట్ చేయలేదని వివరించినట్లు సమాచారం. శ్రీరెడ్డి పవన్ కళ్యాన్ ను తిట్టిన బూతును మ్యూట్ చేసే అన్ని ఛానెళ్లూ ప్రసారం చేశాయని.. కానీ మార్ఫింగ్ వీడియోలతో పరిశ్రమను.. జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని వివరించారు. ఈ గొడవ తర్వాత శ్రీరెడ్డిని ఏ టీవీ ఛానెల్ కూడా చర్చలకు పిలవట్లేదని.. అన్ని ఛానెళ్లూ సంయమనం పాటిస్తున్నాయని.. కానీ పరిశ్రమ వర్గాలే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని జర్నలిస్టు నేతలు వాదించినట్లు సమాచారం.

ఇండస్ట్రీ వాళ్లు ఇండస్ట్రీ వాళ్లలా కాకుండా రాజకీయ పార్టీల నాయకుల్లా వ్యవహరించడాన్ని తప్పుబట్టడమే కాక.. మీడియా మీద దాడులు చేయించడంపైనా జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇరువైపులా సంయమనం.. సహకారం అవసరమైన విషయాన్ని గుర్తు చేసి బ్యాన్ వరకు వెళ్తే పరిస్థితి అదుపు తప్పుతుందనే విషయాన్ని గుర్తు చేయడం.. ఇరు వర్గాలకూ ఇది మంచిది కాదని చెప్పడంతో పరిశ్రమ పెద్దలు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.