Begin typing your search above and press return to search.

రిపోర్ట్ : మూడు నెలల టాలీవుడ్ ప్రయాణం

By:  Tupaki Desk   |   2 July 2019 6:31 AM GMT
రిపోర్ట్ : మూడు నెలల టాలీవుడ్ ప్రయాణం
X
2019లో దిగ్విజయంగా ఆరు నెలలు గడిచిపోయాయి. బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలైతే విడుదలయ్యాయి కానీ స్థూలంగా బాక్స్ ఆఫీస్ కు జోష్ ఇచ్చినవి మరీ ఎక్కువ కౌంట్ లో లేకపోవడం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే అనూహ్యంగా చిన్న సినిమాలు తమ ఉనికిని బలంగా చాటుకోవడం ఔత్సాహిక దర్శకులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

గత మూడు నెలల కాలాన్ని(ఏప్రిల్-జూన్) తీసుకుంటే ఒక్క మహర్షి మాత్రమే స్టార్ హీరో నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవచ్చు. 100 కోట్ల దాకా షేర్ రాబట్టి మహేష్ కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాక బయ్యర్లకు సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఇది మినహాయిస్తే ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మరీ తీవ్రంగా వసూళ్లు కురిపించిన పెద్ద స్టార్ సినిమా ఏదీ లేదు

ముఖ్యంగా ఏప్రిల్ గురించి ఇక్కడ ప్రస్తావించాలి. నాగ చైతన్యకు రెండేళ్లుగా దూరమైన సక్సెస్ మజిలీ రూపంలో దక్కింది. 35 కోట్లకు పైగా షేర్ తో చైతుకు టాప్ గ్రాసర్ గా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని జెర్సీకి లెక్కలేనన్ని ప్రశంశలు వచ్చాయి. కానీ అవి కలెక్షన్స్ గా మారలేక 30 కోట్ల లోపే ఫైనల్ మార్క్ నిలిచిపోవడం కొంత నిరాశ కలిగించినా మార్కెట్ పరంగా చూసుకుంటే నష్టం రాలేదు కాబట్టి ప్రేక్షకులు ముద్ర వేసిన మంచి సినిమాగా నిలిచింది. ఇక ఆరు డిజాస్టర్ల తర్వాత వచ్చిన సాయి తేజ్ చిత్రలహరి కూడా పర్వాలేదు అనిపించుకుంది. రీజనబుల్ బిజినెస్ కు తగ్గట్టు వసూళ్లు రాబట్టి హమ్మయ్య అనిపించింది

ఇక తర్వాత ప్రభావం చూపించింది చిన్న సినిమాలే. సురేష్ సంస్థ అండతో ఫలక్ నుమా దాస్ పర్వాలేదు అనిపించగా మల్లేశంకు మెప్పులు దక్కాయి కానీ ఆ స్థాయిలో సొమ్ములు రాలేదు. అనూహ్యంగా అంచనాలే లేని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సూపర్ హిట్ కావడం మరో విశేషం. బ్రోచేవారెవరురా గ్రాఫ్ పాజిటివ్ టాక్ తో మెల్లగా ఎగబాకడం శుభసూచకమే.

కానీ రాజశేఖర్ కల్కి ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. అంతకు ముందు వచ్చిన తాప్సి గేమ్ ఓవర్ కూడా డీసెంట్ గానే ఆడింది. కానీ సీత-ఎబిసిడి-అభినేత్రి 2-హిప్పీ-సెవన్-ఫస్ట్ ర్యాంక్ రాజు లాంటి సినిమాలు ప్రీ రిలీజ్ ముందు హైప్ ఉన్నా కనీస స్థాయిని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్ సెకండ్ క్వార్టర్ మిశ్రమ ఫలితాలతో నడిచిందనే చెప్పాలి
.