Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలకు ఆ టైంలో చెక్

By:  Tupaki Desk   |   1 Dec 2017 4:36 AM GMT
డబ్బింగ్ సినిమాలకు ఆ టైంలో చెక్
X
పండుగ సీజన్ లో సినిమాను రిలీజ్ చేయడం అంటే.. సేఫ్ జోన్ లోకి వీలైనంత త్వరగా వచ్చేసేందుకు అవకాశం ఉన్నట్లే. అందుకే పలు భాషల్లో పెద్ద సినిమాలనే కాదు.. చిన్నపాటి మూవీస్ ను కూడా అదే సమయంలో వదులుతుంటారు. కానీ మిగతా భాషల కంటే మన దగ్గర డబ్బింగ్ సినిమాల తాకిడి బాగా ఎక్కువ. కంటెంట్ బాగుంటే పరాయి భాష నటులు అనే అంతరం పాటించకుండా.. ఆదరించేసేంతటి విశాల హృదయులు తెలుగు ప్రేక్షకులు.

మిగిలిన భాషల్లో ట్రెండ్ ఇలా ఉండదు. డబ్బింగ్ సినిమాలపై రకరకాల ఆంక్షలు పెడుతుంటారు. తెలుగులోకి డబ్బింగ్ అయ్యే సినిమాలపై ఈ తరహా ఆంక్షలు అవసరం అనే విషయాన్ని ఇప్పటికి గుర్తించగలిగారు టాలీవుడ్ జనాలు. అది కూడా రాబోయే పండుగ సీజన్ లో పోటీ మరీ విపరీతంగా ఉండడమే. ముగ్గురు మీడియం రేంజ్ హీరోలు ఒకసారి పోటీ పడితేనే.. థియేటర్లు సర్దడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. కానీ పొంగల్ కు పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ.. రవితేజ.. రాజ్ తరుణ్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. వీటికి స్క్రీన్స్ అడ్జస్ట్ చేయడమే కష్టం అంటే.. కోలీవుడ్ హీరోలు సూర్య.. విశాల్ కూడా తమ సినిమాలను ఇదే సంక్రాంతికి విడుదల చేస్తామంటున్నారు.

ఇప్పటికి కళ్లు తెరిచిన డిస్ట్రిబ్యూటర్లు.. డబ్బింగ్ సినిమాలను పండుగ సీజన్లలో విడుదల చేయకూడదని.. ఒక వారం తర్వాత మాత్రమే అనుమతించాలనే కొత్త నిర్ణయం తీసుకుని.. అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఒక రకంగా ఇది తెలుగు సినిమాలకు మంచి చేసే విషయమే. ఇప్పటికైనా టాలీవుడ్ సినిమాకు దన్నుగా నిలిచే ఆలోచన చేయడం మంచిదే అనే టాక్ వినిపిస్తోంది.