Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వ‌ల్ల ఏపీకి జీరో రెవెన్యూ?

By:  Tupaki Desk   |   3 Sep 2019 4:35 AM GMT
టాలీవుడ్ వ‌ల్ల ఏపీకి జీరో రెవెన్యూ?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వానికి ఆదాయం ఎంత‌? యేటేటా 150-250 వ‌ర‌కూ సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఇందులో 10 శాతం భారీ చిత్రాల నిర్మాణం సాగుతోంది. మెజారిటీ భాగం మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా బ‌డ్జెట్ రేంజు రూ.40 కోట్ల‌ మినిమం నుంచి రూ.350 కోట్ల మ్యాగ్జిమ‌మ్ రేంజుకు పెరిగింది. 5 కోట్ల నుంచి 20 కోట్ల లోపు బ‌డ్జెట్ ల‌తో చిన్న సినిమాలు.. మీడియం రేంజు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. వీట‌న్నిటిపైనా వంద‌లాది మంది సినీకార్మికులు ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. ప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల్లో నిర్మాత‌లు- న‌టీన‌టులు- ద‌ర్శ‌కులు- సినిమాటోగ్రాఫ‌ర్లు - క‌ళా ద‌ర్శ‌కులు (ఖ‌రీదైన విభాగాలు) .. వీళ్ల‌తో పాటే ఇత‌రత్రా విభాగాలు ప‌రిశ్ర‌మ‌పై డిపెండ్ అయ్యి ఉన్నాయి. అయితే ఇంత‌మందిని పోషించేందుకు నిర్మాత‌లు కం ఫైనాన్షియ‌ర్లు కోటానుకోట్ల రూపాయ‌ల్ని వెద‌జ‌ల్లుతున్నారు. ఇంత డ‌బ్బు వెద‌జ‌ల్లుతున్నా అందులోంచి పన్నుల (జీఎస్టీ - స్థానిక ప‌న్నులు వ‌గైరా) రూపంలో ప్ర‌భుత్వాల‌కు ఎంత చేరుతోంది? నోట్ల ర‌ద్దు- జీఎస్టీ అమ‌లు ప‌ర్య‌వ‌సానం త‌ర్వాత ప్ర‌తిదీ వైట్ లోనే సాగుతోంద‌ని టాక్ వినిపిస్తోంది కాబ‌ట్టి.. సైడు దారి.. అడ్డ దారి ప‌ట్ట‌కుండా నేరుగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఎంత ప‌న్ను చెల్లిస్తున్న‌ట్టు?

ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం దొర‌క‌డం అంత సులువేమీ కాక‌పోయినా.. ఓ ప్ర‌ముఖ నిర్మాత ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం.. టాలీవుడ్ లో 100 నుంచి 150 సినిమాలు నిర్మిస్తున్న రోజుల్లోనే ప‌న్నుల రూపం(అప్ప‌టికి జీఎస్టీ బిల్లు పాస్ అవ్వ‌లేదు)లో దాదాపు 2500 కోట్ల ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూల‌య్యింద‌ని తెలుస్తోంది. సినిమా ప్రొడ‌క్ష‌న్‌.. న‌టీన‌టులు- టెక్నీషియ‌న్ల‌ పారితోషికాలు.. టిక్కెట్లపై ప‌న్ను వ‌గైరా వ‌గైరా క‌లుపుకుని అంత పెద్ద మొత్తం ప‌న్ను వ‌సూలవుతోంద‌ని తెలిపారు. దాదాపు ఐదారేళ్ల క్రితం నాటి మాట అది. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాణం స్థాయి పెరిగింది. బ‌డ్జెట్ల రేంజు.. పారితోషికాల రేంజు అనూహ్యంగా పెరిగిపోయింది. 350 కోట్ల బ‌డ్జెట్ తో సాహోని నిర్మించారంటే ఈ సినిమా మేక‌ర్స్ నుంచే ప్ర‌భుత్వానికి ఎంత ప‌న్ను వ‌సూల‌వుతుంది? అన్న‌ది తేలాల్సి ఉంటుంది. అంటే ఆ మేర‌కు ధ‌న ప్ర‌వాహం సాగుతోంది కాబ‌ట్టి .. టాలీవుడ్ నుంచి ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరాల్సిన మొత్తం చాలా రెట్లు పెరిగిన‌ట్టే. అయితే అది ఎంత వ‌ర‌కూ పెరిగింది అన్న లెక్క తేలాల్సి ఉంది. 2500 కోట్ల నుంచి 5000 కోట్ల‌కు ఇది పెరిగింద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. సినిమా నిర్మాణంలో ర‌క‌ర‌కాల విభాగాల నుంచి పారితోషికాల రూపంలోనూ ప‌న్ను లేదా జీఎస్టీ వ‌సూల‌వుతుంటుంది. అయితే అది ఎంత అన్న‌దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లోనే ఉండిపోతే ఆ మేర‌కు ప‌న్ను ఆదాయం తెలంగాణ ప్ర‌భుత్వ ఖ‌జానాకే చేరుతుంది. అలాంట‌ప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి టాలీవుడ్ నుంచి వ‌చ్చే ప‌న్ను ఆదాయం ఏం ఉంటుంది? అన్న చ‌ర్చా రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం సినీ పెద్ద‌ల్లో హాట్ డిబేట్ గా మారింది. తెలంగాణ ప్ర‌భుత్వ సానుకూల దృక్ప‌థం అంటూ సినీప‌రిశ్ర‌మ పెద్ద‌లు టాలీవుడ్ షిఫ్ట్ అన్న ఆలోచ‌న‌ను విర‌మించుకోవ‌డంతో ఆ త‌ర్వాత ఏపీకి ప‌న్ను ఆదాయం అన్న సంగ‌తిని లైట్ తీస్కున్నారంతా. ఇక సినిమాల రిలీజ్ ల రూపంలో... థియేట‌ర్ల‌లో తెగే టిక్కెట్ల రూపంలో ఏపీ ప్ర‌భుత్వానికి ప‌న్ను ఎంత వ‌సూల‌వుతోంది? అన్న‌ది చూడాలి. టిక్కెట్ల‌పై రేటును బ‌ట్టి 18-28శాతం వ‌ర‌కూ జీఎస్టీ వ‌సూల‌వుతోంది. దానిని ఇటీవ‌ల 18శాతానికి కుదించాక ఆదాయం త‌గ్గింది. అలాగే ఏపీలో లొకేష‌న్ ప‌ర్మిష‌న్ల రూపంలో ఎంత ద‌క్కుతోంది అన్న‌ది చూడాలి. ఇక ఏపీలో ఫిలింఛాంబ‌ర్ యాక్టివిటీస్ ప్రారంభించారు. వీటి ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గం ఏదైనా ఉంటుందా? అన్న‌ది ఛాంబ‌ర్ పెద్ద‌లే చెప్పాలి. ఏపీ ఫిలింటీవీ డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ (ఏపీ ఎఫ్‌డీసీ) ద్వారా ఏపీ సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందితే త‌ద్వారా ఆదాయం పెరిగే వీలుంటుంది.

అయితే ఏపీకి టాలీవుడ్ షిఫ్ట్ అయితే లేదా ఏపీలో ఒక కొత్త టాలీవుడ్ నిర్మాణం జ‌రిగితేనే ప్ర‌భుత్వానికి ఆ ప‌రిశ్ర‌మ నుంచి ఆదాయం ఉంటుంద‌న్న‌ది నిర్వివాదాంశం. ఏపీ- తెలంగాణ డివైడ్ స‌మ‌యంలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం `టాలీవుడ్ షిఫ్టింగ్`. తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎటెళుతుంది? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. హైద‌రాబాద్ నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ బీచ్ సొగ‌సుల‌ వైజాగ్ కి జంప్ అవుతుంద‌ని లేదూ అమ‌రావ‌తిలోనే సెట‌ప్ ఉంటుంద‌ని.. నెల్లూరు త‌డ ఏరియాలోనూ డెవ‌ల‌ప్ చేస్తార‌ని ర‌క‌ర‌కాలుగా ముచ్చ‌టించుకున్నారు. కానీ అందుకు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఎలాంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేద‌ని తేలిపోయింది. టాలీవుడ్ ఏపీకి వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వానికి ప‌న్ను న‌ష్టం ఎంత‌? అన్న‌ది తేలాలంటే ఇన్ని విష‌యాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కేంద్రంగా టాలీవుడ్ నిర్మాణం జ‌ర‌గ‌డంతో ఏపీ నుంచే మెజారిటీ పార్ట్ నిర్మాత‌లు- పంపిణీదారులు-ఎగ్జిబిట‌ర్లు ఇక్క‌డ సెటిలై సినిమాలు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ కేంద్రంగా సాగే ఏ బిజినెస్ వ‌ల్ల అయినా ఇక్కడ ప్ర‌భుత్వానికే ప‌న్ను చెల్లింపులు ఉంటాయి కాబ‌ట్టి ఆ మేర‌కు టాలీవుడ్ నుంచి ఏపీకి ఆదాయం ఉండ‌ద‌ని సినీపెద్ద‌లు చెబుతున్నారు. ఇక‌పోతే కొత్త టాలీవుడ్ నిర్మాణం జ‌రుగుతుంద‌ని ఆశించిన ఏపీ ప్ర‌జ‌లు- యూత్ ఇప్పటికైతే ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయారు. రాజ‌ధాని నిర్మాణ‌మే తేల‌ని స‌న్నివేశంలో ఈ ప‌రిశ్ర‌మ గురించి ఎవ‌రూ మాట్లాడేందుకు ఆస‌క్తిగా లేరు. అస‌లింత‌కీ ఏపీలో కొత్త టాలీవుడ్ ఉన్న‌ట్టా.. లేన‌ట్టా! అన్న సందిగ్ధం అలానే ఉంది ఇప్ప‌టికీ.