Begin typing your search above and press return to search.

‘లై’ని చూసైనా జాగ్రత్త పడతారా?

By:  Tupaki Desk   |   27 Aug 2017 7:01 AM GMT
‘లై’ని చూసైనా జాగ్రత్త పడతారా?
X
పోయినేడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో మూడు సూపర్ హిట్టయ్యాయి. ఒకటి యావరేజ్‌ గా ఆడింది. ఈ ఏడాది సంక్రాంతికి మూడు సినిమాలొస్తే మూడూ భారీ విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఒకటికి మూడు క్రేజీ సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేశారు. కానీ ఈసారి సంక్రాంతి మ్యాజిక్ రిపీటవ్వలేదు. త్రిముఖ పోటీలో ‘లై’ సినిమా అన్యాయం అయిపోయింది. అదేమీ చెత్త సినిమా కాదు. కంటెంట్ ఉన్న సినిమానే. మామూలు సమయంలో వస్తే ఓ మోస్తరుగా ఆడేదేమో. కానీ అంత పోటీని తట్టుకోలేకపోయింది. మాస్ ప్రేక్షకులకు అంతగా ఎక్కని సినిమా కావడంతో దారుణమైన ఫలితాన్ని చవిచూసింది.

ఈ పోటీ వల్ల నేనే రాజు నేనే మంత్రి.. జయ జానకి నాయక సినిమాలు కూడా కొంత మేర వసూళ్లు కోల్పోయాయి. సంక్రాంతి కాకుండా వేరే సమయాల్లో మహా అయితే రెండు సినిమాలు రిలీజ్ చేయొచ్చు కానీ.. అంతకుమించి సినిమాలు రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికిది ఉదాహరణ. గత ఏడాది దసరాకు ఇలాగే నాలుగైదు సినిమాల్ని రిలీజ్ చేశారు. అందులో ఒక్క ‘ప్రేమమ్’ మాత్రమే నిలబడింది. మిగతా సినిమాలన్నీ కొట్టుకుపోయాయి. వచ్చే నెల 8వ తేదీన నాలుగు సినిమాలు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘యుద్ధం శరణం’తో పాటుగా ‘ఒక్కడు మిగిలాడు’.. ‘మేడమీద అబ్బాయి’.. ‘వీడెవడు’ సినిమాల్ని ఒకే తేదీకి విడుదల చేయాలని ఫిక్సయ్యారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఏం జరిగిందో.. ‘లై’ సినిమా ఎలా దెబ్బ తిందో చూసుకున్నాక అయినా ఇలాంటి పోటీల్ని నివారిస్తే మంచిది.