Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల 40కోట్ల ఆస్తి అలా క‌రిగింద‌ట‌

By:  Tupaki Desk   |   15 Nov 2019 2:30 PM GMT
నిర్మాత‌ల 40కోట్ల ఆస్తి అలా క‌రిగింద‌ట‌
X
తెలుగు సినిమా నిర్మాతల మండ‌లి (టీఎఫ్ పీసీ) అంత‌ర్గ‌త‌ క్రైసిస్ గురించి గ‌త‌ ఎల‌క్ష‌న్ టైమ్ లో మీడియాలో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది. నిర్మాత‌ల్లో రెండు వ‌ర్గాల మ‌ధ్య గ‌డ‌బిడ‌పైనా వ‌ర్గ‌పోరుపైనా ఆస‌క్తిగా ముచ్చ‌టించుకున్నారంతా. దాదాపు 1500 మంది స‌భ్యులు ఉన్న‌ మండ‌లి నుంచి కొంద‌రు అగ్ర‌నిర్మాతలు ఎల్.ఎల్.పి పేరుతో విడిపోయి.. ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అనే సొంత కుంప‌టి పెట్టుకోవ‌డంతో అస‌లు చిక్కు మొద‌లైంది. సినిమాలు తీయ‌ని వాళ్ల‌తో మేం క‌ల‌వ‌లేమ‌ని సంఘంలో వాళ్ల పెత్త‌నం భ‌రించ‌లేమ‌ని దిల్ రాజు- డి.సురేష్ బాబు స‌హా ప‌లువురు టాప్ రేంజ్ నిర్మాత‌లంతా క‌లిసి నిర్మాత‌ల గిల్డ్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. సినిమాల ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన రెవెన్యూకు సంబంధించిన డెఫిసిట్ మొద‌లైంది ఇక్క‌డే. ఎవ‌రికి వారు మండ‌లితో సంబంధం లేకుండా మీడియాల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేయ‌డం అన్న ప్రాతిప‌దిక ఏర్ప‌డ‌డంతో అది కాస్తా నిర్మాత‌ల మండ‌లి రెవెన్యూని దారుణంగా దెబ్బ కొట్టింది. ఎన్నిక‌ల సంద‌ర్భంలో ప్ర‌స్తుత నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ .. ప్ర‌త్య‌ర్థి గిల్డ్ అధినేతలు అయిన దిల్ రాజు త‌దిత‌ర వ‌ర్గం మ‌ధ్య బాహాబాహీ ఈ విష‌యంలోనే జ‌రిగింది. మండ‌లిలో క‌ల‌వండి అని సి.క‌ళ్యాణ్ విజ్ఞ‌ప్తి చేసినా ఎవ‌రూ స్పందించ‌లేదు స‌రిక‌దా ఇంకా దూరం జ‌రిగార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మండ‌లి స్థితిగ‌తులు ఎలా ఉన్నాయి? అంటే.. ఇప్ప‌టికే ఇన్నేళ్లుగా ర‌క‌ర‌కాల సంక్షేమ కార్య‌క్ర‌మాలు వ‌గైరా వాటికి అయిన ఖ‌ర్చుల వ‌ల్ల దాదాపు రూ.40 కోట్ల మండ‌లి ఆస్తి 7కోట్ల‌కు క‌రిగిపోయిందని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ నిర్మాత‌ల సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో ఇదంతా క‌ర‌గ‌దీశారు. ఇక ఈ ఏడాది పోతే నిర్మాత‌ల‌కు ఇన్సూరెన్స్ చేయ‌డ‌మే క‌ష్టం.. ఉన్న‌దీ క‌రిగిపోతోంది అంటూ ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల ఓ టాప్ డైరెక్ట‌ర్ కం నిర్మాత ఓ స‌మావేశంలో ఈ సంగ‌తుల్ని వెల్ల‌డించడం వేడెక్కించింది.

నిర్మాతల మండ‌లి ఆదాయం త‌గ్గిపోవ‌డంపై కొత్త అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ నిరంత‌రం గ‌గ్గోలు పెడుతున్నారు. దానిని సెట్ రైట్ చేసేందుకు గిల్డ్ నిర్మాత‌ల్ని తిరిగి మండ‌లిలో క‌ల‌వ‌మ‌ని అక్క‌డ కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్ట‌మ‌ని కోరారు. కానీ అది ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌దే లేదు. దీంతో ఎల్.ఎల్.పి కొట్టిన దెబ్బ మామూలుగా లేదు అంటూ మ‌రోసారి నిర్మాత‌ల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. సినిమాలు తీయ‌ని నిర్మాత‌లు మండ‌లిలో పోగు ప‌డ‌డం వ‌ల్ల‌నే ఇలా అయ్యిందా? అంటూ మ‌రో చ‌ర్చా వేడెక్కిస్తోంది. అయితే ఆస్తి క‌రిగినా ఇన్సూరెన్సులు.. నిర్మాత‌ల‌కు సొంత ఇండ్లు అంటూ మంచి ప‌నుల‌కే ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేశారు. ఇక నిర్మాత‌ల మండ‌లిలో ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల ఆర్థిక‌ప‌ర‌మైన స్కామ్ ల‌పై ప‌లుమార్లు వివాదాలు.. కోర్టు గొడ‌వ‌లు వేడెక్కించాయి. ఇలాంటి స‌న్నివేశంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడైన సి.క‌ళ్యాణ్ స‌మ‌స్య‌ల్ని ఎలా ప‌రిష్క‌రిస్తున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంది.