Begin typing your search above and press return to search.

సినీ ఇండ‌స్ట్రీపై కోలుకోలేని దెబ్బేసిన 2020...!

By:  Tupaki Desk   |   13 April 2020 1:30 AM GMT
సినీ ఇండ‌స్ట్రీపై కోలుకోలేని దెబ్బేసిన 2020...!
X
దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మన టాలీవుడ్ నుండి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు బయటకి వస్తున్నాయి. ఈ సినిమాలు అందర్నీ మనవైపు చూసేలా చేసాయి. మన తెలుగు సినిమాల కోసం ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెయిట్ చేసే పరిస్థితులు వచ్చాయి. మన సినిమాల రిలీజ్ ఉంటే వాళ్ళ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మన తెలుగు సినిమాల స్టామినా. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన సినీ పరిశ్రమ కుదేలవుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం మన టాలీవుడ్ మీద కూడా పడింది. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి సినిమా ఇండ‌స్ట్రీని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రతి ఏడాది కొన్ని వందల సినిమాలతో కళకళలాడుతూ ఉండే టాలీవుడ్ ఈ వంద రోజులలో ఎన్నో ఎదురు దెబ్బలు చూసిందని చెప్పవచ్చు.

2020లో టాలీవుడ్ తొలి వంద రోజుల గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే లాభాల కంటే నష్టాలనే ఎక్కువ చవి చూసిందని చెప్పవచ్చు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజైన పండ‌గ సినిమాలు భారీగా క‌లెక్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు సినీ జ‌నాల్ని కూడా బాగా ఎంట‌ర్ టైన్ చేశాయి. జనవరిలో విడుదలైన 'స‌రిలేరు నీకేవ్వ‌రు' 'అల‌వైకుంఠ‌పురంలో' చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకొని ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు త‌ప్పితే ఈ నెలలో రిలీజైన అన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ ప్లాప్స్ కార‌ణంగా ఈ నెలలో హిట్ సినిమాల‌కి వ‌చ్చిన లాభాల్ని చెప్పుకొని సరిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఫిబ్ర‌వ‌రిలో టాలీవుడ్ పరిస్థితి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే విధంగా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన 'జాను' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కల్లెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక లవర్స్ డే సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాలు ఇండ‌స్ట్రీని న‌ష్టాల బాట ప‌ట్టించాయని చెప్పవచ్చు. అయితే ఆ త‌రువాత 'భీష్మ' సినిమాతో మళ్లీ టాలీవుడ్ స‌క్సెస్ గాలి పీల్చుకుంది. ఆ త‌రువాత రిలీజైన 'హిట్' సినిమాకి పెద్ద‌గా లాభాలు లేకపోయినా జ‌స్ట్ ప‌ర్వాలేద‌నిపించుకుంది. వీటితో పాటు ఈ నెలలో రిలీజైన చిన్నా చితక సినిమాల వల్ల ఇండస్ట్రీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పవచ్చు. వాటిలో 'ఓ పిట్టకథ', 'మధ' లాంటి సినిమాలున్నాయి. ఇక మార్చి నెల విషయానికొస్తే.. ఈ నెలలో సినిమాల మీద కరోనా వైరస్ గెలిచిందని చెప్పవచ్చు.

ఇక మార్చి మొద‌టి, రెండు వారాల్లో వ‌చ్చిన సినిమాలు థియేటర్లలో కంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో బాగా ఆడ‌టం కార‌ణంగా ఈ సినిమాలు వ‌ల్ల ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది మొదటి 100 రోజుల్లో దాదాపు 30 రోజులు థియేట‌ర్స్ మూసే ఉన్నాయి.. 30 రోజులు హిట్ సినిమాలు తీసుకోగా, ఇక మిగిలిన స‌మ‌యం అంతా ఫ్లాప్స్ తో స‌రిపెట్టుకోవాల్సిన వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా లేటెస్టుగా లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించడంతో ఆ సినిమాలన్నీ ఇప్పుడల్లా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అంటే ఏప్రిల్ నెల మొత్తం సినిమా విడుదల లేనట్లే. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సినిమాలు ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ విధంగా చూసుకున్న మే జూన్ నెలలు కూడా టాలీవుడ్ కి నష్టాల్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.