Begin typing your search above and press return to search.

ముగ్గురిలో బ్యాండ్ పడేదెవరికి?

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:30 PM GMT
ముగ్గురిలో బ్యాండ్ పడేదెవరికి?
X
మొత్తానికి ఆగస్టు 11 విషయంలో ఎవ్వరూ రాజీ పడట్లేదు. అదే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. లై.. నేనే రాజు నేనే మంత్రి.. జయ జానకి నాయక.. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వేర్వేరు సందర్భాల్లో ఈ మూడు సినిమాలూ వాయిదా పడతాయని ప్రచారం జరిగింది. కానీ మూడూ కూడా డేట్ మార్చుకోలేదు. పోటీ వల్ల ఇబ్బందని తెలిసినా వెనక్కి తగ్గట్లేదు. వీకెండ్లో మూడు రోజులకు తోడు.. సోమవారం కృష్ణాష్టమి.. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు ఉండటంతో ఈ అడ్వాంటేజీని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు. ఎవరికి వారు తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ తో రంగంలోకి దిగేస్తున్నారు.

ఐతే ఒకేసారి మూడు సినిమాలు వచ్చినా కంటెంట్ ఉంటే బాగానే ఆడతాయనడానికి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలే రుజువు. ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘శతమానం భవతి’.. మూడూ కూడా సూపర్ హిట్లయ్యాయి. మంచి వసూళ్లు తెచ్చుకున్నాయి. కానీ ఇలా పోటీ పడ్డ సందర్భాల్లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. పోయినేడాది దసరాకు అలాగే జరిగింది. హిట్ టాక్ తెచ్చుకున్న ‘ప్రేమమ్’ సినిమా అంచనాల్ని మించి కలెక్షన్లు రాబడితే.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఈడు గోల్డ్ ఎహే’.. ‘అభినేత్రి’.. ‘మనవూరి రామాయణం’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాలకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. వేరే ఛాయిస్ లు ఉన్న నేపథ్యంలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మరి అలా ఏదైనా సినిమా దెబ్బ తింటుందా.. లేక మూడు సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. మంచి వసూళ్లు సాధిస్తాయా.. చూద్దాం.