Begin typing your search above and press return to search.

యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేశారుగా..

By:  Tupaki Desk   |   20 May 2018 5:40 AM GMT
యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేశారుగా..
X
అమెరికాలో తెలుగు సినిమాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ మన సినిమాల ముందు బాలీవుడ్ మూవీస్ కూడా దిగదుడుపే. మన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. మిలియన్లకు మిలియన్లు కలెక్షన్లు వస్తాయి. ఈ ఏడాది వేసవికి యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసేశాయి తెలుగు సినిమాలు. ఈసారి సంక్రాంతికి అక్కడ తీవ్ర నిరాశ తప్పలేదు. ‘అజ్ఞాతవాసి’.. ‘జై సింహా’ సినిమాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. మధ్యలో వచ్చిన సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయంతే. ఐతే వేసవికి మాత్రం మోత మామూలుగా లేదు. నెలన్నర వ్యవధిలో తెలుగు సినిమాలకు ఏకంగా 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు దక్కడం విశేషం.

ముందుగా సమ్మర్ సీజన్లో రిలీజైన ‘రంగస్థలం’ అంచనాల్ని మించిపోయి ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. దాని తర్వాత వచ్చిన మరో భారీ సినిమా ‘భరత్ అనే నేను’ కూడా దాదాపుగా అంతే మేరకు వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ‘మహానటి’ సినిమా 2 మిలియన్ మార్కును దాటి దూసుకెళ్తోంది. మధ్యలో ‘నా పేరు సూర్య’ 8 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’.. నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగ’ కూడా తలో అర మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టాయి. ఇలా లెక్క ఇప్పటికే 10 మిలియన్ల మార్కును దాటేసింది. పదేళ్ల కిందట అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ కావడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. వరల్డ్ వైడ్ తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా అమెరికాలో తెలుగు సినిమాలకు వసూళ్లు వస్తాయి. మన సూపర్ స్టార్ల సినిమాలు రిలీజైతే యుఎస్ బాక్సాఫీస్ వీకెండ్ లిస్టులో వాటికి చోటు దక్కుతుండటం విశేషం.