Begin typing your search above and press return to search.

కనుమరుగవ్వనున్న ఎల్‌ ఎల్‌ పి?

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:56 AM GMT
కనుమరుగవ్వనున్న ఎల్‌ ఎల్‌ పి?
X
టాలీవుడ్‌ లోని కొందరు నిర్మాతలు కలిసి ఏర్పాటు చేసినదే ఎల్‌ ఎల్‌ పి. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ ను మీడియాలో ఎల్‌ ఎల్‌ పి ద్వారా నిర్వహించే వారు. ఎల్‌ ఎల్‌ పి కేవలం టాప్‌ ఛానెల్స్‌ కు మాత్రమే యాడ్స్‌ ఇస్తుందనే విమర్శలు వచ్చాయి. నిర్మాతలు ఎల్‌ ఎల్‌ పి ద్వారా ఛానెల్స్‌ లో యాడ్స్‌ ఇవ్వడం వల్ల కాస్త ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అప్పట్లో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఇచ్చుకోకుండా ఈ పద్దతి బాగానే ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా - మరి కొందరు నిర్మాతలు మాత్రం ఈ పద్దతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎల్‌ ఎల్‌ పికి మద్యలో మళ్లీ కమీషన్‌ ఎందుకు ఇవ్వాలంటూ కొందరు గొగ్గోలు పెట్టారు.

ఎల్‌ ఎల్‌ పి నిర్వహణకు ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులు పోను ఏమైనా ఉంటే మళ్లీ నిర్మాతలు షేర్‌ చేసుకుంటారనేది మొదట ఒప్పందం. అయితే మీడియాతో ఎల్‌ ఎల్‌ పి కి విభేదాలు పెరుగుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలకు ఇది భారీ మొత్తంలో బకాయి పడినదట. కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే కరెక్ట్‌ పేమెంట్‌ చేస్తూ వస్తున్న ఎల్‌ ఎల్‌ పి - కొన్ని ఛానెల్స్‌ కు మాత్రం బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందట. దాంతో ఎల్‌ ఎల్‌ పి ప్రకటనలను ఇక ఛానెల్స్‌ లో వేయవద్దనే నిర్ణయానికి రావడం వల్ల ఎల్‌ ఎల్‌ పిని రద్దు చేయాలనే ఆలోచనలో ప్రముఖ నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎల్‌ ఎల్‌ పి ని రద్దు చేస్తే మీడియా సంస్థలకు ఉన్న బకాయిలు ఎవరు తీరుస్తారనేది ప్రస్తుతం చర్చగా ఉంది. ఎల్‌ ఎల్‌ పి వద్ద కొంత మొత్తంలో నిల్వలు ఉండే ఉంటాయి. ఆ మొత్తంను బకాయిల చెల్లింపులకు వాడాలనేది కొందరు అభిప్రాయం అయితే, మరికొందరు నిర్మాతలు మాత్రం దానికి ససేమేర అంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అతి త్వరలోనే వివాదాస్పద ఎల్‌ ఎల్‌ పి కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.