Begin typing your search above and press return to search.

తెలుగు తెర హీమాన్ .. సుమన్ (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   28 Aug 2021 3:30 AM GMT
తెలుగు తెర హీమాన్ .. సుమన్ (బర్త్ డే స్పెషల్)
X
సముద్రంలో కెరటాలు తగ్గిన తరువాత స్నానం చేయాలనుకుంటే ఒక జీవితకాలం పాటు అక్కడ ఎదురుచూస్తూ కూర్చోవలసిందే. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కదా అని అసలు ప్రయత్నమే చేయకపోతే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోవలసిందే. జీవితంలో అవాంతరాలు ఎదురైనప్పుడు డీలాపడిపోతే, ఆ సమస్య సముద్రమంతై మింగేస్తుంది. ప్ర్రతి అడుగు ధైర్యంగా ముందుకు వేస్తూ వెళుతున్నప్పుడే ప్రతికూల పరిస్థితులు తప్పుకుంటూ ఉంటాయి .. సమస్యపై సాహసంతో విరుచుకుపడినప్పుడే విజేతగా నిలబెడతాయి.

అలా సుడిగాలిలా తనని చుట్టుముట్టిన సమస్యలను సహనంతోనే జయించిన కథానాయకుడిగా సుమన్ కనిపిస్తారు. తన కెరియర్ ను తాను నిలబెట్టుకున్న తీరు చూస్తే, తనని తాను మలచుకున్న శిల్పిలా అనిపిస్తారు. సుమన్ 'మంగుళూరు'లో జన్మించారు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా మద్రాసులో జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన కరాటే పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చారు .. బ్లాక్ బెల్ట్ సాధించారు. అలాగే వివిధ భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ వచ్చారు.

సుమన్ మంచి పొడగరి .. చక్కని రంగు ఉండటం వలన స్నేహితుడు ఆయనను సినిమాల దిశగా అడుగులు వేయించాడు. అలా సుమన్ తమిళ సినిమాలు చేస్తూ తనకంటూ ఆయన ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకి భానుచందర్ తో పరిచయమైంది. ఆయనకి కూడా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉండేది. ఆ అభిరుచి కారణంగానే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. భానుచందర్ ప్రోత్సాహంతోనే సుమన్ తెలుగు తెరకి పరిచయమయ్యారు.

'ఇద్దరు కిలాడీలు' సుమన్ తొలి తెలుగు సినిమా. అయితే ఆ తరువాత చేసిన 'తరంగిణి' ముందుగా విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలా మొదలైన ఆయన ప్రయాణాన్ని 'నేటిభారతం' .. 'సితార' సినిమాలు మరింత ముందుకు తీసుకువెళ్లాయి. అప్పటికే స్టార్ హీరోలుగా వెలుగుతున్నవారితో పోటీ పడటానికి, తనకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ నే సుమన్ నమ్ముకున్నారు. ఫలితంగా యాక్షన్ హీరోగా ఆయనకి ఎక్కువ మార్కులు దక్కాయి. అలా 80వ దశకంలో ఒక రేంజ్ లో ఆయన దూకుడు కొనసాగింది.

90వ దశకం వచ్చేనాటికి ఆయన తాను చేసే యాక్షన్ చుట్టూ ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆయనకి మంచి మద్దతు లభించింది. 'పెద్దింటల్లుడు' .. '20వ శతాబ్దం' .. 'బావ బావమరిది' సినిమాలు ఆయన క్రేజ్ ను మరింతగా పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'అన్నమయ్య' సినిమాలో వేంకటేశ్వరస్వామిగా కనిపించటానికి అంగీకరించడం ఆయన చేసిన సాహసమేనని చెప్పాలి. నిండైన ఆయన విగ్రహానికి .. వేంకటేశ్వర స్వామిగా ఆయన పలికించిన హావభావాలకు ప్రశంసలు లభించాయి.

ఆ తరువాత ఆయన 'శ్రీరామదాసు'లో రాముడిగా కూడా ఆకట్టుకున్నారు. ఇలా ఒక వైపున యాక్షన్ హీరోగా .. మరో వైపున ఫ్యామిలీ హీరోగా .. ఆ తరువాత భక్తి చిత్రాలలో భగవంతుడి పాత్రలలో ఆయన ఒదిగిపోతూ తనని తాను మార్చుకుంటూ రావడం విశేషమేనని అంతా అనుకుంటూ ఉండగా, ఆయన 'శివాజీ' సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రను చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ విలన్ పాత్రలోను ఆయన శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇపుడు ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. విమర్శలకు .. వివాదాలకు దూరంగా తన కెరియర్ ను నడిపిస్తున్న సుమన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం.