Begin typing your search above and press return to search.

ఫోకస్: స్టార్ డైరెక్టర్లకు ఎంత కష్టమొచ్చిందో!

By:  Tupaki Desk   |   4 Dec 2015 10:30 PM GMT
ఫోకస్: స్టార్ డైరెక్టర్లకు ఎంత కష్టమొచ్చిందో!
X
డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌ అంటారు. సినిమా సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది దర్శకుడే. అందుకే దర్శకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ స్టార్‌ హీరోలతో సినిమాలు తీసే స్టార్‌ డైరెక్టర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పటడుగు పడినా సినిమా మేడ కూలిపోతుంది. డైరెక్టర్‌ తేలిపోతాడు. ప్రస్తుతం టాలీవుడ్లో చాలామంది స్టార్‌ డైరెక్టర్లు కట్టిన మేడలు ఇలాగే కూలిపోయాయి. తామేంటో నిరూపించుకోక తప్పని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అగ్రశ్రేణి దర్శకులు. ఒక్క రాజమౌళిని మినహాయిస్తే టాలీవుడ్లో బడా డైరెక్టర్లందూ ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

స్టార్‌ డైరెక్టర్లలో అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది శ్రీను వైట్లే. ఏడాదిన్నర కిందట అతడితో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు వెంటపడే పరిస్థితి. పది కోట్లకు పైగా పారితోషకం అందుకున్న అతి కొద్ది మంది దర్శకుల్లో అతనొకడు. కానీ ఆగడు, బ్రూస్ లీ సినిమాల తర్వాత పరిస్థితి తల్లకిందులైంది. ఇప్పుడు తనతో సినిమా చేయడానికి ఏ స్టార్‌ హీరో ఒప్పుకోని పరిస్థితుల్లో ఎవరితో సినిమా చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు వైట్ల. శ్రీన స్థాయిలో కాకపోయినా వి.వి.వినాయక్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు. 'అఖిల్‌' సినిమా వినాయక్‌ ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్‌ చేసింది. చిరంజీవితో 'కత్తి' రీమేక్‌ తప్పిపోవడానికి కూడా ఇదొక కారణమైంది. అఖిల్‌ కొట్టిన దెబ్బతో రెండు మూడు నెలలు సినిమాల సంగతి పక్కనబెట్టేసి రెస్ట్‌ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశాడు వినాయక్‌. ఆ తర్వాత అతను ఎవరితో సినిమా చేసినా.. తనేంటో రుజువు చేసుకోక తప్పని పరిస్థితి.

మరో బడా డైరెక్టర్ త్రివిక్రమ్ పరిస్థితి కొంచెం మేలే కానీ.. అతనూ ప్రూవ్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. 'అత్తారింటికి దారేది'తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన త్రివిక్రమ్‌ ఒకే ఒక్క సినిమాతో డౌన్‌ అయ్యాడు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అంచనాల్ని అందుకోలేకపోయింది. అది ఫ్లాప్‌ కాకపోయినా త్రివిక్రమ్‌ డిమాండ్‌ తగ్గింది. 'అతడు' దగ్గర్నుంచి బడా స్టార్లతోనే చేస్తున్న త్రివిక్రమ్‌.. ఇప్పుడు నితిన్‌ లాంటి మీడియం రేంజి హీరోతో 'అ.. ఆ' చేస్తున్నాడు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో త్రివిక్రమ్‌ పెన్‌ పవర్‌ తగ్గిందన్న విమర్శల నేపథ్యంలో 'అ..ఆ'తో తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు త్రివిక్రమ్‌.

ఇక పూరి జగన్నాథ్.. ‘టెంపర్’ సినిమాతో తన పూర్వపు ఫామ్ అందుకున్నట్లే కనిపించాడు కానీ.. తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. 'జ్యోతిలక్ష్మీ' మళ్లీ ఆయన్ని మళ్లీ కింద పడేసింది. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ను 'లోఫర్‌'గా చూపిస్తున్నాడు పూరి. మరి ఈ సినిమాతో పూరి మళ్లీ గాడిన పడతాడేమో చూడాలి. గత ఏడాది 'రేసుగుర్రం'తో టాప్‌ డైరెక్టర్స్‌ లీగ్‌లోకి చేరిన సురేందర్ రెడ్డి.. 'కిక్‌-2'తో మళ్లీ డిమోట్‌ అయిపోయాడు. రామ్‌ చరణ్‌ హీరోగా సొంత కథతో సినిమా చేయాల్సిన వాడు.. 'తనీ ఒరువన్‌' రీమేక్‌కు ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి. కెరీర్లో అతడికిదే తొలి రీమేక్‌. ఈ సినిమా హిట్టు కాకపోతే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీని సరిగా రీమేక్‌ చేయలేకపోయాడన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సురేందర్‌కు ఈ సినిమా అగ్నిపరీక్షే.