Begin typing your search above and press return to search.

ఒక్క అడుగు దూరంలో తెలుగు వారియర్స్

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:21 AM GMT
ఒక్క అడుగు దూరంలో తెలుగు వారియర్స్
X
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ హవా కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో పటిష్టమైన భోజ్ పురి దబాంగ్స్ ను ఓడించి.. ఫైనల్స్ కి దూసుకెళ్లిపోయారు. ఆదివారం నాడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో కర్నాటక బుల్డోజర్స్ తో తెలుగు వారియర్స్ తలపడాల్సి ఉంటుంది.

టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది భోజ్ పురి దబాంగ్స్. ఎల్బీడబ్ల్యూగా సచిన్ 13 - సాయిధరం తేజ్ డకౌట్ - ఫాంలో సుధీర్ బాబు 11 పరుగులకు ఔట్ అవడంతో.. వారియర్స్ చిక్కుల్లో ఉన్నట్లు కనిపించింది. అయితే.. మరో ఎండ్ లో ఉన్న ప్రిన్స్ మాత్రం జోరు కంటిన్యూ చేయడం, తర్వాత వచ్చిన అఖిల్ భారీ షాట్లకు దిగడంతో.. స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 68 రన్స్ దగ్గర ప్రిన్స్ ఔట్ అయినా .. అశ్విన్ 18 బాల్స్ లోనే 40రన్స్ చేయడంతో.. వారియర్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 177 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భోజ్ పురి దబాంగ్స్.. తొలుత చక్కగా బ్యాటింగ్ చేసింది. 6 ఓవర్లకే వికెట్లేమీ పడకుండా 60 పరుగులు సాధించడంతో.. మ్యాచ్ మీద పట్టుసాధించినట్లు కనిపించింది. ఏడో ఓవర్లో సచిన్ జోషి బౌలింగ్ లో తివారీ, రామ్ యాదవ్ లు ఔట్ కావడంతో దబాంగ్స్ పతనం మొదలైంది. సామ్రాట్ బౌలింగ్ లో ఆడేందుకు బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. వరుసగా వికెట్లు పడ్డంతో.. వారియర్స్ గెలుపు లాంఛనమే అనుకున్నా.. చివర్లో ఓజా - ఆస్గర్ లు ఫోర్లు - సిక్సర్లతో హడలెత్తించారు. కానీ అస్గర్ రనౌట్ తర్వాత వారియర్స్ పట్టు బిగించి 157 పరుగులకు కట్టడి చేశారు. ప్రిన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

మ్యాచ్ జరుగుతున్నంత సేపు వెంకటేష్ - రెజీనా - ప్రణీత - ఆదాశర్మ చేసిన సందడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెండోసారి సీసీఎల్ ట్రోఫీ అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది తెలుగు వారియర్స్ జట్టు.