Begin typing your search above and press return to search.

బాలయ్య.. క్రిష్ ఈ మహా గండం ఎలా గట్టెక్కుతారో?

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:59 AM GMT
బాలయ్య.. క్రిష్ ఈ మహా గండం ఎలా గట్టెక్కుతారో?
X
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా రిలీజ్ కు ముందు హైప్ భారీస్థాయిలో ఉంది. సాధారణ ఆడియన్స్ మాత్రమే కాదు ట్రేడ్ వర్గాలు కూడా సినిమా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుందని నమ్మారు కాబట్టే 70 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. కానీ సినిమా రిజల్ట్ ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ కు మాత్రమే కాదు కామన్ ఆడియన్సుకూ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచి ఫ్యాన్స్ మరిచిపోదగ్గ రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఈ వారాంతంలో విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన టైమ్ సంక్రాంతి సీజన్. టాలీవుడ్ రిలీజ్ లకు అది బెస్ట్ సీజన్. సరైన కంటెంట్ ఉంటే 100 కోట్ల వసూళ్ళు సాధించడం స్టార్ హీరోల సినిమాలకు సులువే. అలాంటి సీజన్లో రిలీజ్ అయితేనే రూ. 20 కోట్ల తో సరిపెట్టు కోవాల్సివచ్చింది. మరి ఈ రెండో భాగానికి అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. ఫిబ్రవరి సహజంగానే డ్రై సీజన్. పైగా రెండో భాగంలో 'నిజంగా చూపించాల్సిన ఎపిసోడ్లను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయ కారణాలతో తమకు నచ్చినవి చూపిస్తారని' ఇప్పటికే ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీంతో బజ్ చాలా తక్కువగా ఉంది. మరోవైపు ఈ సినిమాకు కౌంటర్ అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ తెరక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే రెండో భాగానికి ప్రమోషన్స్ కూడా లేవు. అటు బాలయ్య గానీ ఇటు క్రిష్ కానీ ప్రచారం చేపట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు మినిమం ఓపెనింగ్స్ అయినా వస్తాయా రావా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ సంగతి పక్కన పెట్టినా.. ఓపెనింగ్ కలెక్షన్స్ కనుక డీసెంట్ గా లేకపోతే బాలయ్య.. క్రిష్ మార్కెట్ ఇంకా పడిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా బాలయ్య.. క్రిష్ ల బాక్స్ ఆఫీస్ స్టామినాకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.