Begin typing your search above and press return to search.

అయ్యో పాపం ద‌ళ‌ప‌తి తెలుగు మార్కెట్!

By:  Tupaki Desk   |   15 Jun 2020 7:30 AM GMT
అయ్యో పాపం ద‌ళ‌ప‌తి తెలుగు మార్కెట్!
X
ఇరుగు పొరుగు హీరోల్ని నెత్తిన పెట్టుకోవ‌డం టాలీవుడ్ వాళ్ల‌కే చెల్లింది. పొరుగున మ‌న‌ల్ని అడుగు పెట్ట‌నివ్వ‌క‌పోయినా మ‌నం మాత్రం నెత్తిన వేసుకుంటాం! అన్న కామెంట్ చాలా కాలంగా ఉన్న‌దే. పొరుగు హీరోలైన ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌-కార్తీ- విజ‌య్- మోహ‌న్ లాల్- స‌త్య‌రాజ్ .. ఇలా అంద‌రూ హీరోల సినిమాలు మ‌న‌వాళ్లు చూస్తున్నారు. అంతో ఇంతో ఆద‌రిస్తున్నారు. ఆయా హీరోల ఎదుగుద‌లలో తెలుగు ఫిలింఛాంబ‌ర్ - నిర్మాత‌ల మండ‌లి పాత్రను త‌క్కువ చేసి చూడ‌లేం. మ‌న‌కు క‌ట్టుబాట్లు లేవు కాబ‌ట్టి ఇరుగుపొరుగు వాళ్లు ఏమైనా చేస్తారు అన్న‌ట్టుగానే ఉంది.

అదే అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు కానీ శాండ‌ల్వుడ్ కి కానీ వెళితే అక్క‌డ సీనే వేరే. పొరుగు హీరోల రాక‌ను కానీ పొరుగు సినిమాల రాక‌ను కానీ అస్స‌లు స‌హించ‌రు. అక్క‌డ ఫిలింఛాంబ‌ర్లు.. నిర్మాత‌ల మండ‌ళ్లు.. చివ‌రికి మేనేజ‌ర్లు కూడా మ‌న హీరోల రాక‌ను ఎంత మాత్రం స‌హించ‌రు. స్వాగ‌తించ‌రు. కానీ అందుకు విరుద్ధంగా మ‌నం పొరుగు హీరోల్ని నెత్తిన పెట్టుకుంటున్నాం. దీనివ‌ల్ల తెలుగు స్ట్రెయిట్ సినిమాలు.. చిన్న సినిమాలు అస్స‌లు బ‌త‌క‌ని ప‌రిస్థితి నెల‌కొందని ప‌లువురు నిర్మాత‌లు వాపోతుంటారు.

ర‌జ‌నీ.. క‌మ‌ల్ .. త‌ర‌హాలోనే తెలుగులో మార్కెట్ కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించని త‌మిళ హీరో లేనేలేడు. అందులో ముఖ్యంగా ఎలాంటి స‌క్సెస్ రేటు లేని ద‌ళ‌ప‌తి విజ‌య్ ని ప‌రిశీలిస్తే ఆ సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. విజ‌య్ న‌టించిన సినిమాల‌కు స‌క్సెస్ రేటు ఇక్క‌డ చాలా త‌క్కువ‌. కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ అత‌డు న‌టించిన సినిమాల్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అంటే మ‌న‌వాళ్లు అంత‌గా ఎంక‌రేజ్ చేస్తున్నార‌నే అనుకోవాలేమో.

ఎలాగైనా విజయ్ తెలుగు మార్కెట్ పెంచాలి అని ఇక్కడ తన టీం తెగ ట్రై చేస్తున్నారు. ఏమైనా కానీ ప‌న‌వ్వ‌డం లేదు. వేరే బాషా హీరో ని మనం ఎలాంటి అడ్డు చెప్పకుండా భలే రిసీవ్ చేసుకుంటాం. ముఖ్యంగా తంబీల్ని. మ‌న ఆడియెన్ అంతో ఇంతో ఆద‌రిస్తున్నారు. కానీ త‌మిళ‌నాడులో ఆడియన్స్ కాదు కదా కనీసం సినిమా కి పని చేసే ప్రమోషన్ మేనేజర్లు కూడా కనీసం మన హీరోలను పట్టించుకోరు. ఇంత‌కుముందు మ‌హేష్ స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ `సాహో` హిందీలో ఇర‌గ‌దీసినా త‌మిళంలో క‌నీస ఓపెనింగులు అయినా లేకుండా అస్స‌లు ఆడ‌లేదంటే వాళ్ల‌కు మ‌న హీరోలంటే అంత లోకువ అనే దాన‌ర్థం.

ఎన్నాళ్లు ఇంకా ఈ తమిళ భజన..! అక్కడ స్టార్ రేంజ్ కి వెళ్లిన ఒక్క తెలుగు హీరో పేరు చెప్పలేం. కానీ ఇక్కడ రజనీ తో మొదలు పెట్టి మొన్న వచ్చిన శివ కార్తికేయన్ వరకు అందరు చాలా మంది తెలుగు యువ‌ హీరోలు కంటే ఎక్కువ మార్కెట్ తెచ్చుకున్నారు ఇక్కడ..! ముందు ఇలాంటివి చూసుకోవాలి ఛాంబర్..! ఆ తరువాత ఇంటర్నల్ విషయాలు సెటిల్ చేసుకోవచ్చు అని తాజాగా హీరో విజయ్ కామన్ డీపీ ని ఉద్దేశించి కొందరు సినిమా పెద్దలు కామెంట్స్ చేశారు. క‌నీసం ఇక‌నైనా మ‌నోళ్లు మార‌తారంటారా?