Begin typing your search above and press return to search.

నాని కి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చలేదు: థమన్

By:  Tupaki Desk   |   16 Nov 2021 7:25 AM GMT
నాని కి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చలేదు: థమన్
X
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ‏లో ఎస్ఎస్ థమన్ ఒకరు. ట్రెండీ మ్యూజిక్‌ తో శ్రోతలకు మెస్మరైజ్‌ చేస్తున్న థమన్.. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నారు. గత రెండేళ్లుగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న సంగీత దర్శకుడు, ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం పట్ల నేచురల్ స్టార్ నాని డిజప్పాయింట్ అయ్యారట. ఈ విషయాన్ని థమన్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

నేడు (నవంబర్ 16) థమన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్ లో ఒప్పుకున్న తర్వాత తన చేతి నుంచి వెళ్లిపోయిన సినిమా 'టక్ జగదీష్' అని థమన్ అన్నారు. ''ఆ సినిమాకి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని గారికి నచ్చలేదు. మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారు. దానికి కొంచం బాధ పడ్డాను. ఇలా నా లైఫ్ లో ఫస్ట్ టైం జరిగింది. నేను హార్ట్ ఫుల్ గానే వర్క్ చేసాను. కానీ ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు'' అని థమన్ చెప్పారు.

నాని గారి పెర్ఫార్మన్స్ నాకు బాగా ఇష్టం. ఈగ - గ్యాంగ్ లీడర్.. ఇలా నాని నటించిన చాలా సినిమాలు నాకు ఇష్టం అని థమన్ అన్నారు. నెక్స్ట్ నాని సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. తనకు ఈగోస్ ఏమీ లేవని.. అలాంటివి బుర్రలో ఉంచుకోనని.. మూవ్ ఆన్ అయిపోతానని థమన్ చెప్పుకొచ్చారు.

కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో నాని - రీతువర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా ‘టక్ జగదీష్’ సినిమా తెరకెక్కింది. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తమన్ పాటలు అందించగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గోపీ సుందర్ కంపోజ్ చేశారు.

అయితే ఆ సమయంలో ఫైనల్ మిక్సింగ్ కోసం ప్రయత్నిస్తుంటే థమన్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి అందుబాటులోకి రాలేదని.. డైరెక్టర్ శివ నిర్వాణ ఫోన్ కూడా టచ్ లోకి రాలేదని.. అందుకే మరో మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారని టాక్ వచ్చింది. అయితే తాను అందించిన నేపథ్య సంగీతం నచ్చకే వేరే వారి వద్దకు వెళ్లారని థమన్ చెప్పడం గమనార్హం.