Begin typing your search above and press return to search.

థమన్ బీజీఎం ఎఫెక్ట్: టీవీ స్పీకర్లు జాగ్రత్తమ్మా..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:15 PM GMT
థమన్ బీజీఎం ఎఫెక్ట్: టీవీ స్పీకర్లు జాగ్రత్తమ్మా..!
X
సంగీత ప్రపంచంలో గత రెండేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎస్ఎస్ థమన్. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. థమన్ తన సంగీతంతోనే సినిమాని సగం హిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల సూపర్ హిట్ అయిన చిత్రాలల్లో మేజర్ రోల్ ఆయనదే ఉంది.

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ''అఖండ'' సినిమా విజయానికి తమన్ బీజీఎం ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సన్నివేశాలను తన అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశారు. ఈ సినిమాకు మరో హీరో థమన్ అని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారంటేనే అర్థం చేసుకోవచ్చు.

థియేటర్లలో అఖండమైన విజయం సాధించిన 'అఖండ' సినిమా ఇప్పుడు డిజిటల్ వేదిక మీదకు వచ్చింది. డిస్నీ + హాట్ స్టార్ లో శుక్రవారం సాయంత్రం ప్రీమియర్‌ గా స్ట్రీమింగ్ అయిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం.. ఓటీటీలోనూ విశేష ఆదరణ అందుకుంటోంది. 24 గంటల్లో ఓటీటీలో ఆల్ టైం హయ్యెస్ట్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

థియేటర్లలో థమన్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్.. ఇప్పుడు హోమ్ థియేటర్లలోనూ అదే స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. బాలయ్య ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ ఆర్ ఆర్ తో స్పీకర్లు దద్దరిల్లిపోతున్నాయని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీన్ - బాలయ్య శివనామ స్మరణం చేస్తున్నప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ స్కోరు అదిరిపోయాయని అంటున్నారు. ప్రతి సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

థమన్ ను నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేస్తారో.. అంతే అభిమానిస్తారని 'అఖండ' స్ట్రీమింగ్ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ చూస్తే అర్థం అవుతుంది. థమన్ సైతం కొన్ని మీమ్స్ ని ఇష్టపడి ట్విట్టర్ లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. 'టీవీ స్పీకర్లు జాగ్రత్తమ్మా' అంటూ పోకిరి పండుగాడు స్టైల్ లో క్రియేట్ చేసిన మీమ్ అందరినీ ఆకర్షిస్తోంది.

'అఖండ' సినిమా విషయంలో థమన్ కు ఈ స్థాయిలో ప్రశంసలు దక్కడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఇంట‌ర్వెల్ సీన్‌ కు ఆర్ఆర్ చేయ‌డానికే 32 రోజులు కష్టపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. బాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. పాటల విషయంలో కూడా థమన్ మంచి మార్కులు వేయించుకున్నాడు. రాబోయే రోజుల్లో థమన్ నుంచి 'రాధే శ్యామ్' ఆర్ఆర్ - 'భీమ్లా నాయక్' - 'సర్కారు వారి పాట' - SSMB28 - NBK107 - 'థాంక్యూ' - 'గాడ్ ఫాదర్' - RC15 వంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి.