Begin typing your search above and press return to search.

థ‌మ‌న్ రొట్టె అలా నెయ్యిలో ప‌డింది!

By:  Tupaki Desk   |   6 May 2020 4:45 AM GMT
థ‌మ‌న్ రొట్టె అలా నెయ్యిలో ప‌డింది!
X
తెలుగు - త‌మిళ్ రెండు చోట్లా టాప్ రేంజ్ సంగీత ద‌ర్శ‌కుడిగా రాణించాలంటే ఆషామాషీ ఏమీ కాదు. తీవ్ర‌మైన పోటీని ఎదుర్కోవాలి. అయితే ఇరుగు పొరుగు సంగీత ద‌ర్శ‌కులు వ‌చ్చి టాలీవుడ్ లో రాణిస్తుంటే ప్ర‌తిసారీ మ‌న తెలుగు సంగీత ద‌ర్శ‌కులు పొరుగు భాష‌ల్లో రాణించ‌లేదేమి? అంటూ ఓ ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే దీనిని రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ లాంటి తెలుగు యువ సంగీత ద‌ర్శకులు బ్రేక్ చేశారు. కోలీవుడ్ లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్నారు త‌మిళంలో. తెలుగులో పెద్ద సంగీత ద‌ర్శ‌కుడే అయినా తంబీల్ని మెప్పించి కోలీవుడ్ లో మెప్పు పొంద‌డం గొప్ప‌త‌న‌మే. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అంత‌టివాడు దేవీశ్రీ‌ని నమ్మి భారీ ప్రాజెక్టుల్ని క‌ట్ట‌బెట్టారంటే దేవీ ట్యాలెంటును ఎంత‌గా న‌మ్మారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక తెలుగు వాడే అయినా కోలీవుడ్ ‌తో చ‌క్క‌ని అనుబంధం ఉన్న ఎస్.ఎస్.థ‌మ‌న్ అక్క‌డ ఏమంత రాణించిందేమీ లేదు. త‌మిళంలో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నా కానీ పెద్ద స్థాయిని అందుకున్న‌దేమీ లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. థ‌మ‌న్ కి టైమ్ వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది. త‌మిళంలోనూ స‌త్తా చాటే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. అది కూడా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ లాంటి టాప్ హీరో సినిమాకి ప‌ని చేసే రేర్ ఛాన్స్ ద‌క్కింది. పైగా ఈ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ లాంటి జాతీయ అవార్డ్ అందుకున్న ద‌ర్శ‌కుడు ప‌ని చేస్తుండ‌డంతో థ‌మ‌న్ జాక్ పాట్ కొట్టాడ‌నే చ‌ర్చా మొద‌లైంది. ప్ర‌ఖ్యాత‌ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించ‌నుంది. అస‌లు ఈ ఆఫ‌ర్ థ‌మ‌న్ నే వ‌రించ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే రెండు మూడు ఆస‌క్తిక‌ర సంగ‌తులున్నాయి.

2020 చార్ట్ బ‌స్ట‌ర్ గీతాల‌తో `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ పేరు మార్మోగింది. ఆ మూవీ రికార్డ్ హిట్ సాధించ‌డంలో సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ ట్యాలెంటుపై ఇంటా బ‌య‌టా చ‌ర్చ సాగింది. బ‌న్ని సినిమా ఇండ‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేయ‌డం వెన‌క థ‌మ‌న్ సంగీతా‌నికి మెజారిటీ వాటా ఉంద‌న్న టాక్ వినిపించింది. ఈ మూవీలో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌య్యాయి. బ‌హుశా అదే విజ‌య్- మురుగ‌దాస్ సినిమాకి ప‌ని చేసే అవ‌కాశం తెచ్చి పెట్టి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే విజ‌య్ - మురుగ‌దాస్ ఇద్ద‌రికీ థ‌మ‌న్ వీరాభిమాని. ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసే చిత్రానికి తాను సంగీతం అందించాల‌నుకుంటున్నాన‌ని ప‌దే ప‌దే ఇంట‌ర్వ్యూల‌లో చెప్పేవాడు. అందుకే ఈ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని భావించాల్సి ఉంటుంది. ఎట్ట‌కేల‌కు స్వరకర్తగా థ‌మ‌న్ కల నెరవేరుతోంది.

తెలుగులో ఇన్నాళ్లు చార్ట్‌బస్టర్ ఆల్బమ్ లు ఇచ్చినా.. ఇన్నేళ్ల‌లో తమన్ తమిళం లో పెద్దగా అలాంటి రేంజుకు చేరుకో లేకపోయాడు. విజయ్-మురుగదాస్ త‌దుప‌రి చిత్రంతో థ‌మ‌న్ కోలీవుడ్ లోనూ బలమైన పట్టు సాధిస్తాడ‌ని భావించ‌వ‌చ్చు. ఈ చిత్రానికి ఏస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నుండ‌డం అద‌న‌పు బ‌లం. క్రేజీ కాంబినేష‌న్ తో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రానికి తెలుగు నాటా క్రేజు నెల‌కొంటుంద‌న‌డంలో సందేహం లేదు.