Begin typing your search above and press return to search.

థమన్ ని ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   11 May 2022 5:30 AM GMT
థమన్ ని ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే
X
సంగీత దర్శకులు చాలా మంది సినిమాకు పాటలు అందించామా.. ఆ పాటల విడుదల సమయంలో కనిపించామా మళ్లీ సినిమా రీ రికార్డింగ్‌ పనులు ముగించేసి సినిమాను ఇచ్చేశామా అన్నట్లుగా ఉంటారు. కాని అందరిలా థమన్ అస్సలే కాదు. ఆయన చాలా విభిన్నమైన వ్యక్తి అని పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఆయన ఒక అరుదైన టెక్నీషియన్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తు ఉంటారు.

సినిమాకు ఒక్క సంగీతాన్ని మాత్రమే థమన్‌ అందించేసి చేతులు దులిపేసుకోడు. థమన్ తన సినిమాకు ప్రాణం పెట్టి పని చేస్తాడు. ముఖ్యంగా ఆయన ఏ పెద్ద హీరోల సినిమాను చేసినా కూడా ప్రమోషన్ విషయంలో చాలా ముందు ఉంటాడు. చిన్న హీరోల సినిమాల విషయంలో కూడా థమన్‌ ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో తాను ఏ సినిమాకు అయితే వర్క్‌ చేస్తూ ఉంటాడో ఆ సినిమా గురించి రెగ్యులర్‌ గా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ ఉంటాడు.

థమన్‌ పదే పదే తన సినిమాల గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉండటం వల్ల ఆయా సినిమాలకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో థమన్‌ చురుకుగా పాల్గొంటున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా సినిమాలోని తన పాటలను మాత్రమే ప్రమోట్‌ చేసుకోకుండా సినిమాను కూడా ప్రమోట్‌ చేస్తూ ఉంటాడు.

సినిమాలోని ఒక పాట లిరికల్‌ వీడియో లో సితార ను తీసుకోవడం అనేది పెద్ద నిర్ణయం. ఆ నిర్ణయంతో సర్కారు వారి పాట సినిమాకు అదనపు పబ్లిసిటీ దక్కినట్లు అయ్యింది. సితార సినిమాలో కనిపించకున్నా కూడా పాటలో ఆమె కనిపించడం వల్ల మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు తో థమన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఇలా ఇంటర్వ్యూలు తీసుకోవడం అనేది సంగీత దర్శకులు ఎక్కువగా చేయరు.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా సమయంలో కీరవాణి చేశారు.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కోసం థమన్‌ హీరో మహేష్ బాబు ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. సినిమా రేపు అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సమయంలో థమన్‌ సోషల్‌ మీడియాలో సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచే విధంగా ట్వీట్ చేయడంతో పాటు మీడియాలో కూడా హడావిడి చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్ విషయంలో ఆయన పనితనం ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

మహేష్‌ బాబు.. కీర్తి సురేష్‌ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. థమన్ అందించిన పాటలు ఇప్పటికే సినిమా పై అంచనాలు మరియు ఆసక్తి పెంచేసింది. ముఖ్యంగా మమ మహేష పాట సినిమా థియేటర్‌ లో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అన్నట్లుగా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.