Begin typing your search above and press return to search.

కన్నీళ్లు పెట్టించే తమన్ కథ

By:  Tupaki Desk   |   1 Oct 2015 3:48 AM GMT
కన్నీళ్లు పెట్టించే తమన్ కథ
X
సినిమా వాళ్లకేంటండీ.. కోట్లు వచ్చి పడుతుంటాయ్.. వాళ్లకు కష్టాల గురించి ఏం తెలుస్తుంది అనుకుంటాం. కానీ ఈ కోట్లు సంపాదించడానికి ముందు అనేకానేక కష్టాలు అనుభవించిన వాళ్లు కూడా ఉంటారు. మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు కూడా కష్టాలు తక్కువేమీ కావు. మన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాగ్రౌండ్ కూడా గొప్పదే కానీ.. అతడి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు లేవనుకుంటే పొరబాటే. ఈ సంగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో తమన్ ఉద్వేగంగా మాట్లాడినపుడే తెలిసొచ్చింది.

తమన్ ఒకప్పటి దర్శకుడు, నిర్మాత అయిన ఘంటసాల బలరామయ్య మనవడన్న సంగతి తెలిసిందే. తమన్ తండ్రి ఘంటసాల శివకుమార్ డ్రమ్మర్ గా చక్రవర్తి, మరికొందరు సంగీత దర్శకుల దగ్గర 700 సినిమాలకు పని చేశాడు. దీంతో తమన్ చిన్నపుడు అతడి కుటుంబం మంచి స్థితిలోనే ఉందట. కానీ తమన్ కు 11 ఏళ్ల వయసులో శివకుమార్ హఠాత్తుగా మరణించడంతో వాళ్ల కుటుంబం చాలా కష్టాల్లో పడిందట. కుటుంబాన్ని ఆదుకోవడానికి తమన్ చదువు వదిలేసి సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకోవాల్సి వచ్చిందట. దీని గురించి తమన్ మాటల్లోనే విందాం.

‘‘1995లో మా కుటుంబానికి పెద్ద నష్టం జరిగింది. నాన్నగారు పోయారు. మా కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పుడు అమ్మ - నేను - చెల్లి మాత్రమే ఉన్నాం. మాకు ఎవరి సపోర్ట్ లేదు. ఆ సమయంలో నాకు నాన్న వరంగా ఇచ్చిన సంగీతమే అండగా నిలిచింది. అప్పటికే నేను నాన్నతో కలిసి రికార్డింగులకు వెళ్లేవాణ్ని. డ్రమ్స్ ప్లే చేయడం నేర్చుకున్నా. పారితోషకం కూడా తీసుకునే స్థాయికి ఎదిగా. నాన్న పోయాక నాకు తెలియకుండానే కుటుంబ బాధ్యత తీసుకున్నాను. చదువు కొనసాగించడానికి అవకాశమే లేదు. ఆరో తరగతి హాఫ్ ఇయర్లీ సమయంలో చదువు వదిలేయాల్సి వచ్చింది. అప్పట్నుంచి సంగీతమే లోకం అయిపోయింది. బాలసుబ్రమణ్యం గారు, ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ గారు నాకు అవకాశాలిచ్చారు. వాళ్లతో కలిసి ఆర్కెస్ట్రా ట్రూప్ లో పని చేశా. మొత్తం 4 వేల షోల్లో పాల్గొన్నా. ఆ తర్వాత రాజ్-కోటి - కీరవాణి - వందేమాతరం - చక్రి - ఆర్పీ పట్నాయక్ - దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లందరి దగ్గరా పని చేశా. మణిశర్మ గారి దగ్గర చాలా నేర్చుకున్నా. ‘కిక్’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డా’’ అని తమన్ చెప్పాడు.