Begin typing your search above and press return to search.

నన్ను బాగా నిరాశపరిచిన పాట అదే: తమన్

By:  Tupaki Desk   |   30 Nov 2021 3:00 AM GMT
నన్ను బాగా నిరాశపరిచిన పాట అదే: తమన్
X
తెలుగు సినిమా పాటకు కొత్త ఊపును .. ఉత్సాహాన్ని తీసుకొచ్చిన సంగీత దర్శకుడు తమన్. తెలుగు పాటకు కొత్త వాయిద్యాలు జోడించి ప్రయాణం చేయించాడు ఆయన. పాట వినగానే ఇది తమన్ బాణీ అనే మార్క్ కనిపించేలా చేసుకున్నాడు. అందుకోసం ఆయన ఎంతో శ్రమించాడు .. కష్టించాడు. మణిశర్మ .. దేవిశ్రీ ప్రసాద్ వంటి హేమా హేమీలతో పోటీపడ్డాడు. కొత్తదనాన్ని కోరుకునే దర్శక నిర్మాతలు తన గురించి ఆలోచించేలా చేసుకున్నాడు. ఫలానా తరహా పాటలు ఆయన మాత్రమే బాగా చేయగలడని అనిపించుకున్నాడు.

తమన్ తనకి వరుసగా వచ్చి పడుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. బాణీలు కట్టే విషయంలో తగిన స్వేచ్ఛను తీసుకుని కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. అద్భుతంగా బాణీలు కట్టడమే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ గొప్పగా ఇవ్వగలడని అనిపించుకున్నాడు. అలాంటి తమన్ తాజా ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. జనంలోకి బాగా వెళుతుందనుకున్న పాట, నిరాశపరిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ పాట నుంచి మంచి రెస్పాన్ ను ఆశించామే .. ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచనలో పడేసిన పాటగా 'ఏడబోయినాడో' అనే పాటను చెప్పుకోవచ్చు. 'అరవింద సమేత' సినిమాలోని పాట అది. వైజాగ్ అమ్మాయి నిఖిత వాయిస్ ఆ పాటకి సెట్ అయింది. ఆమెనే పిలిపించి పాడించాం. ఆ పాటకు జనం నుంచి మంచి స్పందన వస్తుందని అనుకున్నాను. కానీ తీరా చూస్తే 'పెనివిటి' .. 'రెడ్డి ఇక్కడ సూడు' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఏడబోయినాడో'లో ఎంతో హార్డ్ వర్క్ ఉంది.

ఆ పాట వింటూ ఒక మూడ్ లోకి వెళ్లడం కోసం ఎంతో కష్టపడ్డాం. ఆ మూడ్ ను నేను అనుభవించి అందించవలసి వచ్చింది. నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక సంఘటనను గుర్తు చేసుకుని మరీ ఆ పాటను చేశాను. కానీ ఆ పాటకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అప్పుడు మాత్రం నేను చాలా ఫీలయ్యాను. సినిమాలో కాకుండా బయటా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ పాట వింటే ఓ ఐదు నిమిషాల పాటు వేరే లోకానికి తీసుకుని వెళుతుంది. ఎమోషనల్ గా సాగే ఆ పాట జనానికి కనెక్ట్ కాకపోవడం చాలా బాధను కలిగించింది" అని చెప్పుకొచ్చాడు. ఇక ఊహించని విధంగా అంచనాలను దాటేసి ఆదరణ పొందిన పాటగా 'సామజ వర గమనా' నిలిచింది అంటూ చెప్పుకొచ్చాడు.