Begin typing your search above and press return to search.

థమన్ వేవ్ లో కొట్టుమిట్టాడుతున్న క్రేజీ సినిమాలు..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 10:45 AM GMT
థమన్ వేవ్ లో కొట్టుమిట్టాడుతున్న క్రేజీ సినిమాలు..!
X
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ‏లో ఎస్.ఎస్ థమన్ ఒకరు. సంగీత ప్రియులను ట్రెండీ మ్యూజిక్‌ తో మైమరపిస్తూ వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో రచ్చ చేస్తున్నారు. హృదయాలను కదిలించే క్లాస్‌ పాటలే కాదు.. థియేటర్లు దద్దరిల్లే మాస్‌ పాటలతో కూడా ప్రేక్షకుల్ని హోరెత్తిస్తున్నారు. పాటలే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడుతున్నారు. ఈ క్రమంలో వరుస ఆఫర్స్ అందుకుని దూసుకుపోతున్నారు.

ముఖ్యంగా గత రెండేళ్లుగా థమన్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. కేవలం ఆయన సంగీతం వల్ల సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే ప్రస్తుతం సంగీత దర్శకుడి చేతిలో డజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక థమన్ ఉంటే ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ దాదాపు ఐదు కోట్ల వరకూ పలుకుతున్నాయనే టాక్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయారు.

అందుకే సినిమాకు పాటలు ఇవ్వకున్నా.. బీజీఎమ్ ఇచ్చినా చాలని ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల హిందీ 'సూర్యవంశీ' చిత్రానికి బీజీయం అందించిన థమన్.. 'రాధే శ్యామ్' సినిమాకు నేపథ్య సంగీతం అందించే బాధ్యత తీసుకున్నారు. అయితే దీని వల్ల ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమాలకు ఇప్పుడు ఆటంకం కలుగుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'రాధే శ్యామ్' చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరణ్.. హిందీ వెర్షన్‌ కు మిథున్‌ - అను మాలిక్ - మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు మాత్రం థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని భావించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో థమన్ పూర్తిగా ఈ సినిమా మీదే ఫోకస్ పెట్టారు.

క్రిస్మస్ కు రావాల్సిన 'గని' - సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' సినిమాలు వాయిదా పడటంతో వాటి పనులన్నీ ఆపేసి.. థమన్ కంప్లీట్ గా 'రాధే శ్యామ్' సినిమాకు వర్క్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా వాయిదా పడటంతో.. వెంటనే పెద్ద పండక్కి విడుదలయ్యే 'డీజే టిల్లు' ఆర్ ఆర్ బాధ్యత తీసుకున్నారు.

థమన్ మ్యూజిక్ చేయాల్సిన 'భీమ్లా నాయక్' 'గని' సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలానే 'సర్కారు వారి పాట' వంటి పలు పెద్ద సినిమాల పాటలు రిలీజ్ చేయాల్సి ఉంది. అలానే 'థాంక్యూ' 'గాడ్ ఫాధర్' 'RC15' 'SSMB28' 'NBK107' 'Thalapathy66' 'SK20' వంటి సినిమాలు తమన్ వర్క్ చేయాల్సి ఉంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ క్రేజీ కంపోజర్ వద్దే ఉన్నాయి. మరి అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటూ సమయానికి వర్క్ పూర్తి చేస్తారేమో చూడాలి.