Begin typing your search above and press return to search.

'థాంక్యూ' లో అలాంటి ఛాయలు..? విక్రమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో మరి..?

By:  Tupaki Desk   |   14 July 2022 7:30 AM GMT
థాంక్యూ లో అలాంటి ఛాయలు..? విక్రమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో మరి..?
X
అక్కినేని నాగచైతన్య నటించిన "థాంక్యూ" సినిమా రిలీజ్ కు రెడీ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. బీవీఎస్ రవి దీనికి కథ అందించారు. ఈ నెల 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. 'మనం' వంటి క్లాసిక్ తర్వాత చైతూ - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనులున్నాయి.

ఇప్పటి వరకు 'థాంక్యూ' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏమంత బజ్ తీసుకురాలేదు. అయితే ఇటీవల ట్రైలర్ ను రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ఒక మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీతో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. మరీ అంచనాలు పెంచకుండా కథంతా ట్రైలర్ లోనే చెప్పేసి.. ఓపెన్ మైండ్ తో జనాలను థియేటర్లకు రప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

కింది స్థాయి నుంచి వచ్చి, గొప్ప స్థితికి చేరుకున్న అభి అనే వ్యక్తి యొక్క 16 సంవత్సరాల నుండి 35 ఏళ్ల వయస్సు వరకు ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన లైఫ్ సక్సెస్ ఫుల్ గా ఉండటానికి కేవలం తనే కారణమని భావించే యారోగెంట్ అభి.. తర్వాత తన తప్పు తెలుసుకొని తన సక్సెస్ లో భాగమైన వారందరినీ కలిసి థాంక్యూ చెప్పడమే కథాంశమని అర్థం అవుతోంది.

టీనేజ్ లో ప్రేమ.. కాలేజీలో స్టూడెంట్ గొడవలు.. పరిపక్వత చెందిన దశలో మరో ప్రేమకథ వంటివి ఈ సినిమాలో చూపిస్తారు. నాగచైతన్య ఇందులో మూడు భిన్నమైన లుక్స్ లో కనిపించడంతో 'ప్రేమమ్' సినిమా గుర్తుకు రాకమానదు. అలానే మహేష్ బాబు 'మహర్షి' మరియు కార్తికేయ డెబ్యూ 'ప్రేమతో మీ కార్తీక్' వంటి చిత్రాల ఛాయలు కూడా కనిపిస్తున్నాయి.

కాకపోతే విక్రమ్ కె కుమార్ తన టిపికల్ డైరెక్షన్ తో 'థాంక్యూ' లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి చూస్తే.. యూత్ మరియు మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ ను ఆకర్షించే అంశాలతో ఈ సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మాస్ ని ఆకట్టుకోడానికి ఒకటీ రెండు యాక్షన్ సీన్లు కూడా పెట్టినట్లున్నారు.

ఇకపోతే నాగచైతన్య ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించడం సూపర్ స్టార్ అభిమానులను అట్రాక్టు చేసే అంశం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతూ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అభి కాలేజీ రోజుల్లో 'పోకిరి' సినిమా వస్తుందని.. ఆ తర్వాత తన జర్నీలో మహేష్ సినిమాలు కూడా భాగమవుతాయని వెల్లడించాడు. ఇది విక్రమ్ కె కుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా 'థాంక్యూ' లో చూపించారని తెలుస్తోంది. మరి ఈ మూవీ 'మనం' మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

"థాంక్యూ" చిత్రంలో రాశి ఖన్నా - మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా.. అవికా గోర్ కీలక పాత్ర పోషించింది. ప్రకాష్ రాజ్ - సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. లెజెండరీ కెమెరామెన్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.