Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి ఆ డైరెక్టర్ అంటే అంత నమ్మకం!

By:  Tupaki Desk   |   27 May 2022 12:30 AM GMT
మెగాస్టార్ కి ఆ డైరెక్టర్ అంటే అంత నమ్మకం!
X
చిరంజీవితో ఎంతోమంది దర్శకులు పనిచేశారు. ఆయనకి సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకులు ఉన్నారు .. ఫ్లాపులు ఇచ్చిన దర్శకులు ఉన్నారు. ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఎవరికి వారు చిరంజీవిని కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు. ఘన విజయాలను అందుకున్న ఆయన సినిమాల జాబితాలో తమ సినిమా ఉండాలని ముచ్చటపడ్డారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే దర్శకుడిగా తాము ఒక మెట్టు ఎదిగినట్టు భావించినవారు ఉన్నారు. ఆయనతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత వరుస సినిమాలు చేసినవారున్నారు.

అలాంటి దర్శకుల జాబితాలో రవి రాజా పినిశెట్టి ఒకరుగా కనిపిస్తారు. ఆయన ఏ జోనర్ లో సినిమా చేస్తే ఆ జోనర్ లో ఆ సినిమా పెర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. కథను ఎక్కడా కదిలించడానికి వీల్లేనంత పకడ్బందీగా ఆయన ఫ్రేమ్ చేసుకుంటారు.

సినిమా అనేది అన్నివర్గాల ప్రేక్షకులు చూడాలి .. అప్పుడే అది హిట్ అవుతుందని భావించిన దర్శకులలో ఆయన ఒకరు. చిరంజీవితో ఆయన 7 సినిమాలు చేశారు. ఆ జాబితాలో జ్వాలా .. చక్రవర్తి .. యముడికి మొగుడు .. రాజా విక్రమార్క .. ఎస్పీ పరశురామ్ .. ప్రతిబంధ్ .. ఆజ్ కా గూండారాజ్ కనిపిస్తాయి.

చక్రవర్తి .. రాజా విక్రమార్క .. ఎస్పీ పరశురామ్ తమిళం నుంచి తీసుకుని చేసిన రీమేకులు. ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ' జ్వాలా' హిట్ కాగా .. 'యముడికి మొగుడు' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వినోదభరితమైన అంశాలు పుష్కలంగా కలిగిన తెలుగు సినిమాల జాబితాలో 'యముడికి మొగుడు' ముందువరుసలో కనిపిస్తుంది. అంతగా ఆ సినిమాలో అన్నీ కుదిరాయి. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా చోటు సంపాదించుకోవడం విశేషం.

ఇక తెలుగులో రాజశేఖర్ తో కోడి రామకృష్ణ చేసిన 'అంకుశం' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను చిరంజీవితో 'ప్రతిబంధ్' పేరుతో రవిరాజా హిందీలోకి రీమేక్ చేయగా సూపర్ హిట్ అయింది. అదే విధంగా విజయబాపినీడు తెరకెక్కించిన 'గ్యాంగ్ లీడర్'ను హిందీలో 'ఆజ్ కా గూండా రాజ్' టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేసిన రవిరాజా మరో హిట్ ను సొంతం చేసుకున్నారు.

అప్పట్లో ఒక తెలుగు హీరో సినిమాలు బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న దాఖలాలు తక్కువ. అలాంటిది బాలీవుడ్ లో తనకి ఎంట్రీతోనే హిట్స్ ఇచ్చిన రవిరాజా అంటే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం అంటారు. ఇక ఇతర హీరోలతో రవిరాజా చేసిన సినిమాల్లో 'చంటి' .. 'బంగారు బుల్లోడు' .. 'పెదరాయుడు' సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా కనిపిస్తాయి.