Begin typing your search above and press return to search.

అది కొంతమంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యం .. అంతే!

By:  Tupaki Desk   |   8 Feb 2022 9:30 AM GMT
అది కొంతమంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యం .. అంతే!
X
ఏ భాషలో నైనా .. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోయిన్ల కెరియర్ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వాళ్లు కేరక్టర్ ఆర్టిస్టుగా అక్క .. వదిన .. అమ్మ పాత్రలు చేసుకుంటూ వెళుతుంటారు. అలా చేయడం ఇష్టం లేనివారు, హీరోయిన్ గా అవకాశాలు తగ్గగానే తప్పుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం ఉన్న హీరోయిన్లు, గతంలో తాము ఏ హీరోతో జోడీ కట్టారో .. అదే హీరోకి తల్లి పాత్రలు కూడా వేశారు. అయినా ప్రేక్షకులు అంగీకరించడం విశేషం. ఆ హీరోయిన్స్ ఆ హీరోల సరసన ఆడిపాడిన కాలానికీ, ఆ తరువాత తల్లి పాత్రలు చేసిన కాలానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ జోడీ భలే కుదిరింది అనుకున్న జంటలు, ఆ తరువాత అన్నాచెల్లెళ్లుగా .. తల్లీ కొడుకులుగా తెరపైకి వస్తే ప్రేక్షకులు అంగీకరించడం కష్టమే. తెలుగులో అక్కినేని - సావిత్రి హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఒక సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేయవలసి వచ్చింది. తమని అలా చూడటానికి జనం ఇష్టపడరు అని ఆ సినిమా చేయడానికి అక్కినేని ఒప్పుకోలేదు. కానీ అదే సావిత్రికి 'రక్త సంబంధం'లో అన్నగా ఎన్టీఆర్ నటించారు. ఆ పాత్రల్లో వాళ్లు అంతగా ఒదిగిపోయిన కారణంగా ప్రేక్షకులు మిగతా విషయాలను పట్టించుకోలేదు.

'రక్త సంబంధం' వంటి కథలు .. అలాంటి ప్రయోగాలు అంత తేలికగా వర్కౌట్ కావు. తమ అభిమాన హీరో సరసన అందాల రాశిగా అలరించిన కథానాయికలు .. ఆ తరువాత అదే హీరోకి తల్లి పాత్రలు చేస్తే ప్రేక్షకుల మనసు ఒప్పుకోదు. దాంతో ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా కాకుండా తమ అభిమాన హీరో జోడీగా అందాల సందడి చేసిన భామలు, ఆ తరువాత వారికి తల్లి పాత్రల్లో కనిపించినా అభిమానులు ఒప్పుకోవాలంటే, ఆ సినిమాల మధ్య గ్యాప్ బాగా ఉండాలి. అప్పుడే పాత విషయాలను పట్టించుకోవడం మానేసి, కొత్త కథలపైనే వాళ్లు దృష్టి పెడతారు.

అలా చూసుకుంటే తెలుగు తెరను ప్రభావితం చేసిన ప్రేమకథలు రెండే రెండు. ఒకటి ఏఎన్నార్ 'దేవదాసు' అయితే, రెండవది ఎన్టీఆర్ 'మల్లీశ్వరి'. ఈ సినిమాలో ఎన్టీఆర్ - భానుమతి జోడీ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించింది. 'ఏడ తానున్నాడో బావా' అంటూ భానుమతి పాడుతుంటే, వెంటనే వెళ్లి ఎన్టీఆర్ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాలనిపిస్తుంది. అంతగా ఆ పాత్రలలో వాళ్లు జీవించారు. అలాంటి భానుమతి .. ఆ తరువాత 'సామ్రాట్ అశోక' సినిమాలో ఎన్టీఆర్ కి తల్లిగా కనిపించారు. అయినా ప్రేక్షకులు అంగీకరించారు .. ఆదరించారు.

ఇక ఏఎన్నార్ కెరియర్ తొలినాళ్లలో .. అంటే, సావిత్రి కంటే ముందుగా ఆయన సరసన అలరించిన కథానాయికగా అంజలీదేవి అనే చెప్పాలి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సువర్ణ సుందరి'ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. తెలుగు జానపదాల్లో ' సువర్ణ సుందరి' స్థానం ప్రత్యేకం. ఆ సినిమాలో 'పిలువకురా .. అలుగకురా' అంటూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన అంజలీదేవి, ఆ తరువాత కాలంలో అక్కినేనికి తల్లి పాత్రల్లోను కనిపించారు .. మెప్పించారు. అలాగే చిరంజీవి సరసన 'మగధీరుడు' సినిమాలో ఆడిపాడిన జయసుధ, 'రిక్షావోడు'లో ఆయన తల్లిగా కనిపించారు. అదే విధంగా వెంకటేశ్ జోడీగా 'స్వర్ణకమలం' వంటి హిట్ అందుకున్న భానుప్రియ, ఆ తరువాత 'జయం మనదేరా'లో ఆయన తల్లిగా ఔరా అనిపించారు.

వెండితెరపై హీరోలకి గల క్రేజ్ .. కెరియర్ ఎక్కువ కాలం ఉంటుంది. వివాహమనేది వాళ్ల కెరియర్ కి ఎలాంటి అంతరాయం కలిగించదు. అదే హీరోయిన్స్ విషయానికి వస్తే వివాహం .. పిల్లలు సమయంలో వాళ్ల కెరియర్ కి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ. ఈ లోగా ఆ హీరోల సరసన కొత్త హీరోయిన్లు చేరిపోతారు .. తెరపై వాళ్ల ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. ఏదేమైనా ఒక హీరో జోడీగా మంచి మార్కులు కొట్టేసినవారు, అదే హీరోకి తల్లిగా వేసే అవకాశం కూడా చాలా తక్కువమందికి మాత్రమే లభిస్తుంది. ఆ రకంగా ఆ హీరోయిన్లకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వొచ్చు .. అలా కూడా ప్రేక్షకులను మెప్పించిన వాళ్ల నటనా పటిమను అభినందించవచ్చు.