Begin typing your search above and press return to search.

తల్లి సమాధిని తరలించే సీన్ కి ప్రేరణ అదేనట!

By:  Tupaki Desk   |   20 April 2022 5:30 AM GMT
తల్లి సమాధిని తరలించే సీన్ కి ప్రేరణ అదేనట!
X
సినిమా ఇండస్ట్రీకి వెళితే పేరుకు పేరు .. డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చునని చాలామంది అనుకుంటారు. అందుకోసమే రోజూ ఎంతోమంది ఇక్కడ వాలిపోతూ ఉంటారు. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమాల ద్వారా డబ్బు .. పేరు వచ్చేమాట నిజమే. అయితే అది వెంటనే జరిగిపోయే పనికాదు. అందుకు చాలా సమయం పడుతుంది. హీరోలకు ఒక సినిమా హిట్ తో వచ్చేంత పేరు దర్శకులకు రాదు. వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా మారాలంటే వరుస హిట్లతో కొన్ని సినిమాలు చేయవలసి ఉంటుంది. అయితే ప్రశాంత్ నీల్ విషయంలో అందుకు భిన్నంగానే జరిగింది.

ప్రశాంత్ నీల్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ సినిమా అభిమానులంతా మాట్లాడుకుంటున్నారు. 'ఉగ్రమ్' అనే ఒక చిన్న సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. తనని తాను నిరూపించుకోవడం కోసం ఆయన మరి కొన్ని చిన్న సినిమాలు చేస్తూ వెళ్లలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా 'కేజీఎఫ్' సినిమా చేశాడు. విడుదల వరకూ ఆ సినిమాను అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిందే.

ఆ తరువాత ఆయన చేసిన 'కేజీఎఫ్ 2' కూడా అంతకు మించిన వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుండటం విశేషం. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఆశ్చర్య చకితులను చేస్తే, మదర్ సెంటిమెంట్ సీన్స్ మనసును భారం చేస్తాయి.

ఈ సినిమాలో హీరో ముంబాయిలో ఉన్న తన తల్లి సమాధిని ఉన్నపళంగా పెకిలించి తీసుకుని వచ్చి తన సామ్రాజ్యంలో పెట్టేస్తాడు. 'కేజీఎఫ్'లోనే ఆమెకి సమాధిని కట్టిస్తాడు. సాధారణంగా ఇలాంటి ఒక సీన్ ఇంతవరకూ తెర పైకి రాలేదు. ఈ సీన్ కి చాలామంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇలాంటి ఒక ఐడియా ఎలా వచ్చిందనే ప్రశ్నకి ప్రశాంత్ నీల్ స్పందించాడు.

"మా నాన్నమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. నేనంటే తనకి ఎంతో ప్రేమ. నేను ఏం చేసినా .. ఏమైనా అన్నా ఆమె పట్టించుకునేది కాదు. నేను ఎప్పుడైనా కోప్పడినప్పటికీ నాపై ఆమెకి ఉన్న ప్రేమ ఎంతమాత్రం తగ్గేది కాదు. నేను తినకపోతే తాను చాలా బాధపడిపోయేది.

నన్ను బ్రతిమాలుతూ తానే తినిపించేది. ఆమె చనిపోయినప్పుడు ఇక్కడ సొంత స్థలం లేకపోవడం వలన, ఆంధ్రప్రదేశ్ లోని మా ఊరికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేశాము. ఏదో ఒక రోజున తన సమాధిని తీసుకొచ్చి వాకిట్లో పెట్టుకోవాలని అనుకునేవాడిని. అది ప్రాక్టికల్ గా కుదరదు గనుక, ఆ ఆలోచనను ఈ సినిమాలో వాడుకున్నాను" అని చెప్పుకొచ్చారు.