Begin typing your search above and press return to search.

అక్క‌డ‌ జోరుగా సినిమా షూటింగులు..!

By:  Tupaki Desk   |   4 Jun 2021 3:30 AM GMT
అక్క‌డ‌ జోరుగా సినిమా షూటింగులు..!
X
క‌రోనా మొద‌టి ద‌శ‌లో సినిమా ఇండ‌స్ట్రీపై ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించాయి. కానీ.. సెకండ్ వేవ్ లో స్వ‌యంగా సినీ ప‌రిశ్ర‌మే మూతేసుకుంది. థియేట‌ర్ల నుంచి షూటింగుల వ‌ర‌కు అన్నీ సొంతంగానే బంద్‌ చేసుకుంది. చిత్ర ప‌రిశ్ర‌మపై క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ప‌డిందో చెప్ప‌డానికి ఈ ఉదాహ‌ర‌ణ‌ చాలు! ఏప్రిల్ లో మొద‌లైన ప‌రిస్థితి ఎందాక పోతుంది? ఎన్నాళ్ల వ‌ర‌కు ఉంటుంది? అనేది ఎవ్వ‌రూ చెప్ప‌లేకుండా ఉంది.

స‌మ్మ‌ర్ టార్గెట్ గా.. పెద్ద చిత్రాల‌న్నీ ఏప్రిల్ నుంచి రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకున్నాయి. కానీ.. వ‌కీల్ సాబ్ త‌ర్వాత మ‌రో సినిమా రిలీజ్ కాలేదు. ఏప్రిల్ లో మీడియం సినిమాలు నాలుగైదు రిలీజ్‌ కావాల్సి ఉండ‌గా.. అవ‌న్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. మే నెల‌లో మెగాస్టార్ ఆచార్య‌, బాల‌య్య‌ అఖండ‌, ర‌వితేజ ఖిలాడీ వంటి చిత్రాలు రావాల్సి ఉండ‌గా.. అవ‌న్నీ వెన‌క్కుపోయాయి. దీంతో.. చిత్ర ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అర్థంకాకుండా పోయింది.

ఇలా సినిమాల‌న్నీ వాయిదా ప‌డ‌డంతో నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టం వాటిల్లుతుండ‌గా.. అటు షూటింగులు నిలిచిపోవ‌డంతో కార్మికులు ఆక‌లికి అల‌మటిస్తున్నారు. క‌నీసం చేయ‌డానికి ప‌నిలేక ప‌స్తుల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇండియాలోని అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కొన్ని సినిమాల‌ను ఓటీటీలో వ‌దిలేస్తున్నారు.

అయితే.. మ‌న ద‌గ్గ‌ర ప‌రిస్థితి ఇలా ఉండ‌గా.. హాలీవుడ్ లో మాత్రం మెరుగ‌వుతోంది. అక్క‌డ సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉండ‌డంతో జోరుగా షూటింగులు జ‌రుపుకుంటున్నారు. వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల‌వుతుండ‌డంతో బాక్సాఫీస్ కూడా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇన్నాళ్లూ అక్క‌డ ఇండోర్ షూటింగ్ లు నిర్వ‌హించ‌గా.. జాన్ విక్ ఫ్రాంచైజీలోని చాప్ట‌ర్ 4 మూవీ పారీస్ లో ఔట్ డోర్ షూటింగ్ కూడా జ‌రుపుకోబోతోంది.

క‌రోనా విజృంభించిన త‌ర్వాత ఓ హాలీవుడ్ మూవీ ఔట్ డోర్ కు సిద్ధ‌మ‌వ‌డంతో ఇదే మొద‌టిసారి. పారిస్ తోపాటు న్యూయార్క్, జ‌పాన్ లో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. మ‌న ద‌గ్గ‌ర ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడు వ‌స్తుందోన‌ని ఆశ‌గా ఎదురు చూస్తోంది ఇండ‌స్ట్రీ. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే.. జూన్ లో కూడా షూటింగులు, థియేట‌ర్లు ఓపెన్ అయ్యేట్టు క‌నిపించ‌ట్లేదు. మ‌రి, మ‌న‌ద‌గ్గ‌ర సినిమాకు మంచి రోజులు ఎప్పుడు వ‌స్తాయో చూడాలి.