Begin typing your search above and press return to search.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్: టెర్రరిస్ట్ పాత్రలో ఇరగదీసిన సమంత..!

By:  Tupaki Desk   |   19 May 2021 9:30 AM GMT
ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్: టెర్రరిస్ట్ పాత్రలో ఇరగదీసిన సమంత..!
X
''ది ఫ్యామిలీ మ్యాన్‌ 2'' సిరీస్ ద్వారా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మనోజ్‌ బాజ్‌ పాయ్‌ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సీరీస్‌ కు కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. తీవ్రవాదం - సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న సీజన్ 2 ట్రైలర్ తాజాగా విడుదలయింది.

ట్రైలర్ చూస్తుంటే 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 1 కంటే సీజన్ 2 మరింతగా ఉత్కంఠభరితంగా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో హ్యూమర్ ని కూడా జోడించారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్ - ప్రియమణిలతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. సమంత ఇప్పటి వరకు పోషించని టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్‌ బాంబర్‌ గా కనిపించి షాక్ ఇచ్చింది. డీగ్లామర్‌ లుక్‌ లో కనిపించిన సామ్‌.. వాళ్లను నేను చంపేస్తా అంటూ తమిళంలో సవాలు విసురుతోంది. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత.. నెగిటివ్ రోల్ లో యాక్టింగ్‌ ఇరగదీసినట్లు అర్థం అవుతుంది.

'ఫ్యామిలీ మ్యాన్ 2' నేపథ్యాన్ని ఈసారి చెన్నై కి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో మరికొందరు సౌత్ ఆర్టిస్టులను తీసుకున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సీజన్ లో సమంత కు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. షరీబ్ హష్మి - శరద్ కేల్కర్ - శ్రేయా ధన్వంతరి - మైమ్ గోపి - సన్నీ హిందుజా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి కామెరాన్ ఎరిక్ బ్రైసన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేతన్ సోదా బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. సుమిత్ కోటియన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఈ సిరీస్ రిలీజ్‌ డేట్‌ ను కూడా మేకర్స్ ప్రకటించారు. జూన్‌ 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. సమంత డెబ్యూ వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.