Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మొట్ట మొద‌టి పాన్ ఇండియన్ హీరో

By:  Tupaki Desk   |   31 May 2021 11:36 AM GMT
టాలీవుడ్ లో మొట్ట మొద‌టి పాన్ ఇండియన్ హీరో
X
వందేళ్ల భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలుగు చిత్ర‌సీమ దాదాపు 89ఏళ్లు పైగానే మ‌నుగ‌డ సాగించింది. ఇంత‌టి సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న టాలీవుడ్ లో తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ఎవ‌రు చేశారు? అంటే వెట‌ర‌న్ న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ గురించే చెబుతారు.

ఆ రోజుల్లోనే ఆయ‌న సాంకేతికంగా ఇత‌ర హీరోల‌తో పోలిస్తే చాలా అడ్వాన్స్ డ్ గా ఆలోచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న టెక్నాల‌జీక‌నుగుణంగా సినిమాల్ని తెర‌కెక్కించారు. తెలుగు తెర‌పై ఆయ‌న ఒక ప్ర‌యోగ‌శాల‌. తొలి స్కోప్ సినిమా.. తొలి ఈస్ట్ మ‌న్ క‌ల‌ర్ సినిమా.. తొలి డీటీఎస్ సినిమా.. తొలి 70ఎంఎం సినిమా.. తొలి కౌబోయ్ సినిమా.. తొలి స్పై సినిమాని చేసింది ఆయ‌నే.

ఐదు ద‌శాబ్ధాల కెరీర్ లో దాదాపు 350 కి పైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోజుల్లో చేయ‌ని ప్ర‌యోగం లేదు. ఆదుర్తి సుబ్బారావు ఆయ‌న‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌గా.. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గానూ ప్ర‌యోగాలు చేసి స‌త్తా చాటారు. కృష్ణ ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం అత‌డికి భారీ ఫాలోయింగ్ ని ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక ఇమేజ్ ని తెచ్చింది. సాటి హీరోల‌తో పోటీప‌డి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసిన ప్ర‌యోగాత్మ‌క హీరోగా.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా వెలిగిపోయారు. 2009లో ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్నారు.

ఇక అత‌డు న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు (1971) ఆరోజుల్లోనే పాన్ ఇండియా రేంజులో అన్ని భాష‌ల్లో విడుద‌లైంది. ఆంగ్లంలోనూ రిలీజై ప్ర‌ముఖుల్ని ఆక‌ట్టుకుంది. తొలి సినిమా స్కోప్ చిత్రం - అల్లూరి సీతారామ రాజు (1974).. మొదటి ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ - ఈనాడు (1982),.. మొదటి 70 ఎంఎం - సింహాసనం (1986),.. మొదటి డిటిఎస్ ఫిల్మ్ - తెలుగు వీర లేవరా (1995).. మొదటి స్పై ఫిల్మ్ - గూఢ‌చారి 116 (1966).. వీట‌న్నిటితో ఆయ‌న సంచ‌ల‌న విజ‌యాలందుకున్నారు. కృష్ణ గారు తొలి తెలుగు జేమ్స్ బాండ్ గా అల‌రించారు. గూఢ‌చారి 116 స్ఫూర్తితో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆ స్థాయిలో ఆడ‌లేదు.

అలాగే సూప‌ర్ స్టార్ కృష్ణ అంటే మెగాస్టార్ చిరంజీవి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎంతో అభిమానం క‌న‌బ‌రుస్తారు. సాటి హీరోల‌తో ఆయ‌న సాన్నిహిత్యం అంతే గొప్ప‌ది. జాన‌ప‌దాలు చారిత్రాత్మ‌క క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేసిన మేధావిగానూ కృష్ణ‌కు ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. అన్నిటినీ మించి ఆయ‌న డైలాగ్ ప‌వ‌ర్ అంతా ఇంతా కాదు. డైలాగ్స్ చెప్ప‌డంలో సీరియ‌స్ స‌న్నివేశాన్ని ర‌క్తి క‌ట్టించ‌డంలో కృష్ణ పంథాయే వేరు. ప్ర‌స్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల‌ను రూపొందిస్తూ సంచ‌ల‌నాల‌కు తెర తీస్తోంది. నేటిత‌రం హీరోల‌కు ఆనాడే పునాది వేసింది మాత్రం సూప‌ర్ స్టార్ అనే చెప్పాలి. 2016లో వ‌చ్చిన శ్రీ‌శ్రీ ఆయ‌న చివ‌రి సినిమా. ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంత జీవితాన్ని గ‌డుపుతున్నారు. నేడు ఆయ‌న 78వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా తుపాకి త‌ర‌పున‌ శుభాకాంక్ష‌లు.