Begin typing your search above and press return to search.

ప్ర‌యోగం అని తెలీసీ ఎందుకీ మృదంగం?

By:  Tupaki Desk   |   6 March 2019 1:30 AM GMT
ప్ర‌యోగం అని తెలీసీ ఎందుకీ మృదంగం?
X
సంగీత ప్ర‌ధాన క‌థ‌ల‌తో సినిమాలు తీస్తే ఈరోజుల్లో హిట్లు వ‌స్తాయా? క‌ళాత‌ప‌స్వి రోజులు మ‌ళ్లీ తిరిగొస్తాయా? ఇలాంటి సందేహాలెన్నో తెలుగు ప్రేక్ష‌కుల్ని నిరంత‌రం తొలిచేస్తూనే ఉంటాయి. అయితే సంగీతం అనేది అజ‌రామ‌రం. అది అంతూ ద‌రీ లేనిది. సంగీతం ప్ర‌ధానాంశంగా సినిమాలు తీసి హిట్ కొట్టొచ్చు. అయితే అందులో క‌మ‌ర్షియ‌ల్ స్ట‌ఫ్ ఎంత ఏర్చి కూర్చారు? అన్న‌ది ఇంపార్టెంట్. శంక‌రాభ‌ర‌ణం ఇప్పుడొస్తే హిట్టొస్తుందా? అంటే అందుకు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్, డైరెక్ట‌ర్ రాజీవ‌న్ చెప్పిన స‌మాధానం ఆలోచింప‌జేసేదే.

కాలాన్ని బ‌ట్టి అభిరుచి మారుతుంది. శంకరాభరణం ఇప్పుడు తీస్తే ఆదరిస్తారా.. లేదా? అన్న‌ది చెప్ప‌లేను. అంత‌టి దృష్టి నాకు లేదు. మ‌న‌సుకు న‌చ్చింది చేయ‌డ‌మే నాకు తెలుసు. దానికి స్పందించి జ‌నాలు ఆద‌రించారా లేదా? అన్న‌ది మాత్ర‌మే నేను చూస్తాను! అని స‌ర్ ప్రైజింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు ఆయ‌న‌. అందుకే రాజీవ‌న్ 19 ఏళ్ల త‌ర్వాత ఇంత‌కాలానికి ద‌ర్శకుడిగా మ‌రో సినిమాకి ప‌ని చేశారు. రాజీవ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెరుపు క‌ల‌లు, ప్రియురాలు పిలిచింది చిత్రాలు సంగీత ప్ర‌ధానంగా ఆక‌ట్టుకున్న సినిమాలు. ఆ సినిమాల్లో సినిమాటోగ్ర‌ఫీ అంతే మైమ‌రిపిస్తుంది. జ‌నాల‌కు న‌చ్చే సినిమాలు తీయాలంటే మ‌న కంట్రిబ్యూష‌న్ ఎంత‌? అన్న‌ది ఆలోచిస్తాన‌ని రాజీవ‌న్ తెలిపారు.

19 ఏళ్ల క్రితం ఆయ‌న రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర్వాత సినిమాటోగ్రాఫ‌ర్ గా కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే ప‌ని చేశారు. చివ‌రిగా మ‌ణిర‌త్నం క‌డ‌ల్ (క‌డ‌లి) చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ప్ర‌స్తుతం జీవీ ప్ర‌కాష్ కుమార్ క‌థానాయ‌కుడిగా `స‌ర్వం తాళ‌మ‌యం` అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌లే త‌మిళంలో రిలీజైన ఈ చిత్రం అక్క‌డ చ‌క్క‌ని టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ అదే టైటిల్ తో అనువ‌దించి త్వ‌ర‌లో రిలీజ్ చేస్తున్నారు. టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. మృదంగం త‌యారీ చేసే కుటుంబంలో జ‌న్మించిన కుర్రాడు సంగీత కారుడు కాకూడ‌దా? ద‌ళితుడు స్వ‌ర‌క‌ర్త కాకూడ‌దా? అనే సంఘ‌ర్ష‌ణ‌తో పాయింట్ ఎంచుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్ మీడియాతో ముచ్చ‌టిస్తూ క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ పై త‌న అభిమానాన్ని చాటుకున్నారు. శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని 1000 సార్లు చూశాన‌ని ఆయ‌న తెలిపారు. భాష‌తో ప‌ని లేకుండా ఉండేది తాళం. సంగీతానికి భాషా జ్ఞానం కావాలి కానీ, తాళానికి అవ‌స‌రం లేద‌న్న సీక్రెట్ ని ఆయ‌న తెలిపారు. రాజీవ‌న్ సినిమాలు చేయ‌క‌పోయినా ఆయ‌న గొప్ప సినిమా జ్ఞాని. మ‌ణిరత్నం, ఏ.ఆర్.రెహ‌మాన్ లాంటి దిగ్గ‌జాల‌కు అత్యంత స‌న్నిహితుడు. గొప్ప మేధావి. యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో ఎంద‌రో విద్యార్థుల్ని త‌యారు చేసిన గొప్ప‌ లెక్చ‌ర‌ర్. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌క‌ర‌కాల వ్యాప‌కాల‌తో సినిమాలు చేయ‌ల‌క‌పోయాన‌ని ఇక‌పై ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతాన‌ని రాజీవ‌న్ తెలిపారు. స‌ర్వం తాళ‌మ‌యం తెలుగులోనూ హిట్ కొడుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.