Begin typing your search above and press return to search.

నా కథల్లో హీరోయిన్స్ చాలా తెలివైనవాళ్లు: యండమూరి

By:  Tupaki Desk   |   2 Feb 2022 11:30 PM GMT
నా కథల్లో హీరోయిన్స్ చాలా తెలివైనవాళ్లు: యండమూరి
X
తెలుగు ప్రజలకు టీవీలు అందుబాటులోకి రానికాలంలో, అందరికీ కాలక్షేపం కథల పుస్తకాలు .. నవలలే. ఆ కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు యండమూరి వీరేంద్రనాథ్. ఆ సమయంలో ఆయనకి ఒక హీరోతో సమానమైన క్రేజ్ ఉండేది. ఆ తరువాత ఆయన నవలలు చాలావరకూ సినిమాలుగా వచ్చాయి. అప్పుడు కూడా యండమూరి వీరేంద్రనాథ్ పేరు మారుమ్రోగిపోయింది. ఇటు సినిమా రచయితగా .. అటు నవలా రచయితగా ఆయన ఎంతో బిజీగా ఉండేవారు. ఇప్పుడు పుస్తకాలు చదివేవారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన అంటే తెలియనివారు లేరు. అలాగే ఆయన పట్ల అభిమానం కూడా ఎవరికీ ఎంతమాత్రం తగ్గలేదు.

అప్పుడప్పుడు ఆయన మెగా ఫోన్ పడుతూ వస్తున్నారు. అలా తాజాగా ఆయన 'అతడు ఆమె ప్రియుడు' సినిమాను రూపొందించారు. యండమూరి రాసిన నవలల్లో 'అతడు ఆమె ప్రియుడు' నవలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పట్లో బాగా పాప్యులర్ అయిన ఆ నవల పేరుతో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో యండమూరి మాట్లాడారు.
"నేను ఇంతవరకూ రచయితగా 35 సినిమాలకి పనిచేశాను. ఏ కథలోను హీరో .. హీరోయిన్ ను టీజ్ చేయడం ఉండదు. నా కథల్లో హీరోయిన్స్ అందరూ కూడా చాలా తెలివితేటలతో ఉంటారు.

నేను దర్శకత్వం చేయవలసి వచ్చేసరికి అదే ఆలోచిస్తానే తప్ప, మరో రకంగా ఆలోచించలేను. సత్యజిత్ రే .. మృణాల్ సేన్ టైపు సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. నా సినిమాలు సెమీ ఆర్ట్ ఫిలిమ్స్ .. ఆర్ట్ ఫిలిమ్స్ లా అనిపిస్తుంటాయి. అలా నేను చేసిన 'స్టూవర్టు పోలీస్ స్టేషన్' కూడా ప్రేక్షకులను నచ్చకపోవడంతో చాలాకాలం పాటు స్తబ్దుగా ఉండిపోయాను. ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో .. నాకు సంబంధించిన ఆడియన్స్ చూస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అందువల్లనే ఈ మూడు నెలల్లో రెండు సినిమాలను ప్రాక్టీస్ చేశాను.

జీవితంలో ఒకసారి ఒకరినే ప్రేమించాలి .. వారు వెళ్లిపోతే మరొకరిని ప్రేమించకూడదని కొంతమంది అనుకుంటారు.

ఒకసారి ప్రేమలో పడిన తరువాత వారు వెళ్లిపోతే మరొకరిని ప్రేమించవచ్చని మరికొందరు భావిస్తారు. ఒకే సమయంలో ఎంతమందినైనా ప్రేమించవచ్చని ఇంకొందరు అభిప్రాయపడతారు. అసలు ప్రేమ అనేదే ట్రాష్ అనుకునేవాళ్లు కూడా ఉంటారు. వీళ్లంతా ఒక వర్షం కురిసే రాత్రిలో ఒక చోట కలుస్తారు. మరుసటి రోజుతో ప్రపంచం ఎండ్ అయిపోతుందని తెలిసినప్పుడు వాళ్లంతా ఎలా ఆలోచిస్తారు? అనేదే ఈ కథ" అని చెప్పుకొచ్చారు.