Begin typing your search above and press return to search.

'గేమ్ ఆఫ్ త్రోన్స్' రేంజ్ లో 'మహాభారతం' వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దిగ్గజ ఓటీటీ..?

By:  Tupaki Desk   |   14 July 2021 3:30 AM GMT
గేమ్ ఆఫ్ త్రోన్స్ రేంజ్ లో మహాభారతం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దిగ్గజ ఓటీటీ..?
X
భారతీయ ఇతిహాసం 'మహాభారతం' ఆధారంగా ఇప్పటికే అనేక భాషల్లో సినిమాలు తెరకెక్కాయి. హిందువులకు పంచమ వేదంగా పరిగణించే 'మహాభారతం' లోని అధ్యాయాలను తీసుకొని రకరకాల పేర్లతో ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ భారీ బడ్జెట్ కేటాయిస్తూ మహాభారతాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొందరు ఫిలిం మేకర్స్ అందులోని అధ్యాయాలను తీసుకొని సినిమాలుగా రూపొందిస్తే.. మరొకొందరు అందులోని పాత్రలను తీసుకొని ఒక్కో కోణంలో ఒక్కో సినిమాగా మలిచారు.

అయితే ఇంతవరకు ఏ ఫిల్మ్ మేకర్ కూడా 'మహాభారతం' మొత్తాన్ని తెరపైన చూపించలేకపోయారనే చెప్పాలి. పలు భాషల్లో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి భారతాన్ని చూపించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే అది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా రూపొందించనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

డిజిటల్ వరల్డ్ లో సత్తా చాటుతున్న వరల్డ్ టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఒకటి ''మహాభారతం'' ఇతిహాసన్ని వెబ్ సిరీస్ గా మలచడానికి ఏర్పాట్లు చేస్తోందట. దీని కోసం దాదాపు 3000 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నారట. హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించే ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఒక పాపులర్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో సదరు దిగ్గజ ఓటీటీ చర్చలు కూడా ప్రారంభించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆ స్టార్ డైరెక్టర్ అయితేనే ఈ భారీ ప్రాజెక్ట్ ని డీల్ చేయగలడని భావించిన ఓటీటీ సంస్థ.. దర్శకుడికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా రెడీ అయ్యారట. అగ్ర దర్శకుడి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 'గేమ్ ఆఫ్ త్రోన్స్' 'వైకింగ్స్' రేంజ్ లో 'మహాభారతం' వెబ్ సిరీస్ ని రూపొందించాలని ఓటీటీ వారు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కమిట్మెంట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఓటీటీతో డీల్ కుదుర్చుకుని ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తారేమో చూడాలి. ఒకవేళ 'మహాభారతం' వెబ్ సిరీస్ కు అడుగులు పడితే మాత్రం ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.